Friday, April 19, 2024
Friday, April 19, 2024

తప్పు చేయలేదు
విచారణ ఎదుర్కొంటా

. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు
. అందుకే ఈడీ ప్రయోగం
. నవంబరు, డిసెంబరులో ఎన్నికలు!
. దిల్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

న్యూదిల్లీ: ‘నేను ఎటువంటి తప్పు చేయలేదు…ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)విచారణను ధైర్యంగా ఎదుర్కొంటా… బీజేపీ తెలంగాణలో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోలేదు కనుక కేంద్రప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తోంది’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం పేర్కొన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనకు నోటీసులివ్వడంపై కవిత దిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 9న విచారణకు రావాలని ఈడీ నోటీసు ఇచ్చిందని, 11న విచారణకు తమ ఇంటికి రమ్మని ఈడీని కోరానన్నారు. ఈమేరకు ఈడీకి సమాచారం ఇచ్చినా ఈడీ ఒప్పుకోలేదన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారించాలని చట్టం చెబుతోందని, మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఇది తన ఒక్కరి సమస్యే కాదని, ఈడీ ఎందుకింత హడావుడిగా దర్యాప్తు చేస్తోందో అర్థం కావడం లేదని కవిత చెప్పారు. తనతోపాటు ఎవర్ని విచారించినా తనకు ఇబ్బంది లేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో మోదీ కంటే ముందు ఈడీ వస్తోందని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్‌ చేశారన్నారు. తమ పార్టీకి చెందిన సుమారు 15 మంది నేతలపై దర్యాప్తు సంస్థల దాడులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. మోదీ వన్‌ నేషన్‌ – వన్‌ ఫ్రెండ్‌ స్కీమ్‌ తెచ్చారని, విపక్షాలను టార్గెట్‌ చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు. అధిక ధరలు, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని ఆమె కేంద్రానికి సలహా ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరగానే క్లీన్‌చిట్‌ ఇస్తున్నారని కవిత చెప్పారు. తాము ఎవరికీ బీ టీమ్‌ కాదని, ఎప్పటికీ ఏ టీమేనన్నారు. తన తండ్రి, సోదరుడితో పాటు పార్టీ మొత్తం తనకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ నేతల్ని విచారించడం కేంద్రానికి అలవాటైపోయిందన్నారు. మోదీ పార్లమెంట్‌లో కూడా అబద్ధాలు చెబుతున్నారని, గాంధీ పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోందన్నారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా ధర్మం గెలుస్తుందని కవిత చెప్పారు. తాను ధైర్యంగా ఈడీ విచారణకు వెళ్తున్నా… బీఎల్‌ సంతోష్‌ ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని కవిత చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లు ఆమోదం పొందలేదన్నారు. 2014, 2018 మహిళా బిల్లుపై బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళా బిల్లును కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టారని విమర్శించారు. మహిళా బిల్లు ఆమోదం కోసం ఈ నెల 10న శుక్రవారం దిల్లీలో నిరాహార దీక్ష చేపడతానని, రేపటి ధర్నాలో 18 పార్టీలు పాల్గొంటాయని ఆమె చెప్పారు. పూర్తి మెజార్టీతో గెలిపించినా మహిళా బిల్లుపై బీజేపీ మాట తప్పిందని, మహిళా బిల్లుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేవడంలో సోనియా పాత్ర అమోఘమని కవిత ప్రశంసించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టంగా మారేలా చూడాలని ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ఈడీ విచారణకు మనస్ఫూర్తిగా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. నవంబరు, డిసెంబరులో తెలంగాణలో ఎన్నికలు రావచ్చని, ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని దుయ్యబట్టారు. ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులను భయభ్రాంతులకు గురిచేయడమే ఆ పార్టీ లక్ష్యమని అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం తమవైపే ఉన్నాయని, ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
కవిత దీక్షకు అనుమతి నిరాకరణ
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై శుక్రవారం దిల్లీలోని జంతర్‌ మంతర్‌ కవిత నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు ముందుగా ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌ తో రేపు నిరసనలు చేపట్టాలని కవిత భావించారు. అయితే వివిధ కారణాలను సాకుగా చూపుతూ అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పారు. కవిత దిల్లీలో మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు ఈ మేరకు సమాచారం ఇవ్వడం గమనార్హం. భద్రతా కారణాల రీత్యా కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని, లేకుంటే వేదికను మరో చోటకు మార్చుకోవాలని సూచించారు. కాగా తాము ముందే అనుమతి తీసుకున్నామని, ఇప్పుడు ఇలా రద్దు చేయడం ఏమిటని కవిత ప్రశ్నించారు. 5 వేల మందితో సభ నిర్వహించేందుకు 10 రోజుల క్రితమే అనుమతి ఇచ్చారని తెలిపారు. అయితే బీజేపీ వాళ్లు కూడా ధర్నాకు అనుమతి కోరారని, దీంతో జంతర్‌ మంతర్‌ లోని సగం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలంటూ సూచించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికిప్పుడు బీజేపీ వాళ్లు సభ పెట్టుకోవటం ఏంటని, ఇదంతా కావాలనే చేస్తున్నట్లు తెలుస్తోందని కవిత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. అయితే తమ దీక్షలో మాత్రం మార్పులేదని, యథావిధిగా నిరసన కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img