Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం

. ముందుకొచ్చిన దిగ్గజ కంపెనీలు
. అమెరికాలో కేటీఆర్‌ను కలిసిన అనేక సంస్థల ప్రతినిధులు
. రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు

విశాలాంధ్ర-హైదరాబాద్‌: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నదని అమెరికా పర్యటనలో భాగంగా కలిసిన కంపెనీలతో రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలను వెల్లడిరచారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కేటీఆర్‌ అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముందుకువస్తున్నాయి. బెయిన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌నకు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌, మండీ హోల్డింగ్స్‌ వంటి కంపెనీలు ఆసక్తిని కనబర్చాయి. హైదరాబాద్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ప్రకటించింది. తద్వారా 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో ఈ కంపెనీలు సేవలు అందిస్తున్నది. అదేవిధంగా టెక్నాలజీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు మండీ హోల్డింగ్స్‌ ప్రకటించింది. హూస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో మండి హోల్డింగ్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌, సీఈవో ప్రసాద్‌ గుండుమోగుల సమావేశమయ్యారు. హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు ద్వారా 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. తెలంగాణలో గ్లోబల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ను కలిగి ఉన్న స్టోరబుల్‌ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. జానాథన్‌ లూయిస్‌, నీల్‌ వర్మల నేతృత్వంలో కంపెనీ ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌లో 41,000 స్టోరేజ్‌ సేవలను అందిస్తున్న ఈ టెక్‌ దిగ్గజం హైదరాబాద్‌లో 100 మంది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లను నియమించుకోనుంది. రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కోసం నిపుణులను తీసుకోనున్నట్లు తెలిపింది. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌తో పాటు స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. ఇదిలావుంటే, హైదరాబాద్‌లో త్వరలో జరిగే డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి రైట్‌ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ కొత్త సెంటర్‌ ద్వారా 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలతో కంపెనీకి భాగస్వామ్యం ఏర్పడుతుంది. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ కార్యకలాపాలను కొనసాగిస్తామన్న రైట్‌ సాఫ్ట్‌వేర్‌ వెల్లడిరచింది. వరంగల్‌లో ఒక డెవలప్‌మెంట్‌ సెంటరును త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాగా, బ్యాంకింగ్‌, కమర్షియల్‌ బ్యాంకింగ్‌, ఇన్వెస్ట్మెంట్‌ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చార్లెస్‌ స్క్వాబ్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ అయి తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలతో పాటు ప్రభుత్వ విధానాలను వెల్లడిరచి పెట్టుబడులు పెట్టాలని కోరారు. టెక్సాస్‌కు చెందిన ‘రేవ్‌ గేర్స్‌’ యాజమాన్య బృందం తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్‌తో చర్చించింది. తెలంగాణలో తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపింది.
డిజిటల్‌ సొల్యూషన్స్‌, సప్లై చెయిన్‌లో పేరొందిన టెక్‌ జెన్స్‌ కంపెనీ బృందం తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలపై కేటీఆర్‌తో చర్చించింది. ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, డిజైన్‌ థింకింగ్‌ కోసం అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రతిపాదిత కేంద్రం, టెక్జెన్స్‌ కార్యకలాపాలకు ఊతమిస్తుందని, వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు లక్ష్మి యనిగళ్ల, సీఈవో రఘు కొమ్మరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img