Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలంగాణలో మరో 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాల్లో నేటి నుంచి మరో నాలుగు రోజులు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.ఇప్పటికే హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతాల్లో వరదనీరు అనేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ఇటీవల భారీ వర్షాలు బీభత్సం సృష్టించగా.. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ
ఐదు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో అత్యధికంగా 21 సెంటిమీటర్లు, జనగామ జిల్లా దేవరుప్పులలో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు జనగామ బస్టాండ్‌తో పాటు జనగామ-హైదరాబాద్‌ రహదారి పూర్తిగా జలమయమైంది. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దముప్పారం-దంతాలపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్మరికొంట్ల పెద్ద చెరువు అలుగుపారడంతో.. రేపోని, జాలుబావుల, లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ముప్పారం శివారులో వరదలో తొర్రూరుకు చెందిన నలంద పాఠశాల బస్సు చిక్కుకోగా.. అందులో ఉన్న విద్యార్థులను స్థానికులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు మరోసారి పోటెత్తుతున్న వరద
మరోవైపు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు, చెక్‌డ్యాములు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని లెండి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం మండలంలో నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జుక్కల్‌ మండలం బాబాల్‌గావ్‌, సవాల్‌గావ్‌ ప్రాంతాలకు రవాణా స్తంభించింది. నాగిరెడ్డిపేట్‌లో అత్యధికంగా 15 సెంటీమీటర్లు, నిజాంసాగర్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ కౌలాస్‌ నాలా, పోచారం ప్రాజెక్టులకు మరోసారి వరద వచ్చి చేరుతోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ కూడా నిండుకుండలా మారింది. భారీగా వరదనీరు వస్తుండటంతో కిందికి విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img