Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలంగాణ నేతల రిక్వెస్ట్‌.. రాహుల్‌ పాదయాత్రలో మార్పులు!

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ నెల ఏడో తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభం కాను­న్న ఈ యాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,500 కిలోమీటర్లకు పైగా సాగనుంది. కేరళలో 19 రోజులు, కర్ణాటకలో 21 రోజుల తర్వాత రాహుల్‌ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించనున్నారు. రాహుల్‌ గాంధీ కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా నుంచి తెలంగాణలోకి ప్రవేశించనున్నారు.
అయితే భారత్‌ జోడో యాత్రలో స్వల్ప మార్పుల కోసం ఏఐసీసీకి తెలంగాణ పీసీసీ నేతలు రిక్వెస్టు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాలను కవర్‌ చేసేలా రూట్‌ను మార్చాల్సిందిగా పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల మీదుగా కొన్ని ముఖ్యమైన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలను టచ్‌ చేసేలా మార్పులు చేస్తే పార్టీకి కలిసొస్తుందని, హెచ్‌ఎండీఏ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు సంగారెడ్డి జిల్లాను కవర్‌ చేసేలా పాదయాత్ర చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే తెలంగాణలో పాదయాత్ర రూట్‌మ్యాప్‌ మార్పులతో ఇతర రాష్ట్రాల షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేతల రిక్వెస్ట్‌పై పార్టీ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.
ఫస్ట్‌ ఫేజ్‌లో భాగంగా సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర భారత్‌ జోడో యాత్ర జరగనుంది. రోజుకు 25 కిలోమీటర్ల మేర నడిచేలా ఏఐసీసీ కమిటీ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసింది. దీని ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌ దగ్గర ఈ యాత్ర తెలంగాణలోకి ప్రవేశించి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌ దగ్గర మహారాష్ట్రలోకి వెళ్తుంది. అయితే ఈ యాత్ర సరిహద్దు జిల్లాల్లో కొనసాగుతున్నందున రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఈ యాత్ర పొలిటికల్‌ మైలేజీ రావాలంటే హైదరాబాద్‌ సహా సమీపంలోని జిల్లాల మీదుగా కొనసాగేలా మార్పులు చేయాలని కోరుతున్నారు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించి హెచ్‌ఎండీఏ ప్రాంతాలను, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను టచ్‌ చేసేలా కొత్త రూట్‌ను ఫైనల్‌ చేసే పనిలో పీసీసీ నేతలున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా రూట్‌ ఖరారు చేయాలని చర్చలు జరిగినా ఎక్కువ సమయం పడుతుందనే భావనతో దాన్ని విరమించుకున్నట్లు సమాచారం. ఈ యాత్రకు తెలంగాణ ఇన్‌చార్జిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ వ్యవహరిస్తున్నందున ఆయనతో పీసీసీ నేతలు చర్చలు జరుపుతున్నారు.
తెలంగాణ పీసీసీ కోరుకుంటున్నట్లుగా భారత్‌ జోడో రూట్‌ మ్యాప్‌లో మార్పులు చేస్తే ఆ సమయాన్ని ఏ స్టేట్‌లో ఎలా కవర్‌ చేయాలన్న దానిపై హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టాల్సి ఉంది. అయితే తమకు రిక్వెస్ట్‌కు ఏఐసీసీ సానుకూలంగా స్పందిస్తుందని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img