Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దీటుగా ఎదుర్కొంటాం

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రల్ని

. రేపు మహా ధర్నాలతో మహోద్యమానికి శ్రీకారం
. గనుల వేలం యత్నాలను కేంద్రం విరమించాలి
. సింగరేణికే గనులు కేటాయించాలి
. తెలంగాణ ప్రగతిని దెబ్బతీయడమే బీజేపీ ధ్యేయం
. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

విశాలాంధ్ర -హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో మహా ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడిరచారు. ఈ నెల 8వ తేదీన మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడిరచారు. ఈ మేరకు సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందని కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే అనేకమార్లు గనుల వేలం ప్రక్రియకు యత్నించినప్పటికీ ప్రైవేటు కంపెనీల నుంచి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అటు సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్‌ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని అన్నారు. ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకుందని కేటీఆర్‌ ఆరోపించారు. లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ లోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కు కూడా గనులు కేటాయించకుండా ఆ సంస్థను దివాలా తీయించిన కేంద్రం అదే విష ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తోందన్నారు. పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరుతామని కేటీఆర్‌ అన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌ పై అపార ప్రేమను కనబరుస్తున్న ప్రధాని మోదీ… ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని గుర్తుచేశారు. నవంబర్‌ 12 , 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానమంత్రే.. సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటీకరించం అని మాటిచ్చి నిలుపుకోలేకపోయారని గుర్తుచేశారు. ప్రధాని.. హామీకే దిక్కులేకపోతే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మరోసారి రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో దానిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్‌ఎఫ్‌ లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలోనే ఏ ఒక్కరికైనా ఉందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోందని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న సీఎం కేసిఆర్‌ గారి సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు. రైతులతోపాటు రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ ఫలాలను గండికొట్టాలని కేంద్రం చూస్తోందన్నారు అందుకే ఉచిత పథకాలను.. అనుచితాలని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడం ఆయనకు పేదప్రజలపై ఉన్న కక్షపూరిత వైఖరిని వెల్లడిస్తుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడం, మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పడంతో కేంద్రం దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్‌ సైరన్‌ మోగిస్తామని… మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటీకరించే కేంద్రం కుట్రలు ఫలిస్తే.. తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందని, సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాలలో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్స్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దు అవుతాయని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి గమ్యాన్ని ముద్దాడిరదన్నారు. ఈ సారి పురుడుపోసుకునే మహోద్యమంతో.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని మంత్రి కేటిఆర్‌ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img