Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాతబస్తీలో ప్రశాంత వాతావరణం.. తెరుచుకున్న దుకాణాలు, ఆంక్షల కొనసాగింపు

హైదరాబాద్‌ పాతబస్తీలో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం క్రమంగా సద్ధుమణుగుతోంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో గురువారం ఉదయానికి చార్మినార్‌ సహా పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనల తగ్గుముఖం పట్టాయి. పోలీసుల ఆంక్షల మధ్యే గురువారం ఉదయం దుకాణాలు తెరుచుకున్నాయి. నగరంలో ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదని.. ఎవరైనా నిరసనలకు దిగితే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి సద్దుమణిగేవరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. పాతబస్తీలో పరిస్థితిని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బుధవారం రాత్రి ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు ఎక్కడిక్కడే చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వి పోలీస్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాల చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్‌ ఫోర్స్‌ రాత్రంగా రోడ్లపై గస్తీ నిర్వహించాయి. గురువారం ఉదయానికి పరిస్థితి సద్దుమణిగినా ఏ సమయంలో ఏం జరుగుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మూడు రోజుల పాటు ఆంక్షలు
పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద భద్రతను రెట్టింపు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సిటీ వెస్ట్‌, సౌత్‌ జోన్ల పరిధిలోని దుకాణాలు, హోటళ్లపై పోలీసులు బుధవారం ఆంక్షలు విధించారు. రాత్రి 7-8 గంటల్లోపు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ ఆంక్షలు మూడు రోజుల పాటు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. పలుచోట్ల పెట్రోల్‌బంకులు, ఎల్పీజీ స్టేషన్లు మూసివేయటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గురువారం నుంచి అవసరమైతే ట్రాఫిక్‌ మళ్లిస్తామని సిటీ ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img