Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల కార్మికుల జీతం పెంపు

విశాలాంధ్ర, హైదరాబాద్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 20 సంవత్సరాలుగా పని చేయుచున్న శానిటేషన్‌, పేషెంట్‌కేర్‌, సెక్యూరిటీ కార్మికులకు 11వ పీఆర్సీ సందర్భంగా జీతాలు పెంచకపోవటం అన్యాయమని వెంటనే ఈ కార్మికుల జీతాలు పెంచాలని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ Ê వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటియుసి) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా గత 15 రోజులుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్మికులు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున విషయం తెలిసిందే. జులై 2 నుంచి సమ్మె నిర్వహిస్తామని నోటీసు సైతం ఇచ్చారు. దీనికి స్పందించిన ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం రూ.19 ఇచ్చే విధంగా జి.ఓ.నెం.21ను తీసుకువచ్చింది. ఆ జి.ఓ.ను అమలు చేసేలా బుధవారం యూనియన్‌ ప్రతినిధులు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ మరియు వైద్య విధాన పరిషత్‌ కమీషనర్‌ డా.రమేష్‌ రెడ్డిని కలిశారు. ఈ జి.ఓ. అమలు చేస్తున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ Ê వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు యం.డి.యూసుఫ్‌, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి యం.నర్సింహ్మా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస వేతనాలు పెంచమని కోరుతున్నా పట్టించుకోలేదని, ఈ జి.ఓ.నెం. 21తో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసిందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 2 సంవత్సరాలుగా కరోనాలాంటి అంత్యంత క్లిష్టపరిస్థితుల్లో సైతం విధులు నిర్వహిం చినటువంటి శానిటేషన్‌, పేషెంట్‌కేర్‌, సెక్యూరిటీ కార్మికులకు ఈ జి.ఓ.ను అమలు చేయటం ద్వారా న్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు. జి.ఓ.లో పొందుపర్చిన విధంగా కార్మికుల జీతాలతో పాటు చట్ట ప్రకారం రావల్సిన పండుగ, జాతీయ, ఆర్జిత సెలవులు అమలు చేయాలని, నైట్‌ అలవెన్సులు ఇవ్వాలని వారు కోరారు.
వైద్య రంగంపై రాబోవు రోజుల్లో పని భారం పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో కార్మికుల సంఖ్యను బెడ్‌లకు అనుగుణంగా పెంచాలని, కార్మికుల జీతాలు మెటీరియల్‌ ఖర్చులు టెండర్‌ షెడ్యూల్డ్‌లో విడివిడిగా పొందుపర్చాలని వారు కోరారు. రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో ఈ జి.ఓ.ను అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అందుకు డిఎంఇ సమాధానం ఇస్తూ గతంలో పాత రేట్ల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించటం జరిగిందని, కొత్తగా వచ్చినటువంటి ఈ జి.ఓ.ను అనుసరించి మరొకమారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెంటనే పంపిస్తానని, సాధ్యమైనంత త్వరలో కార్మికులకు నూతన జీతాలు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు యూనియన్‌కు హామీఇచ్చారు.
డిఎంఇని కలిసిన వారిలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాసీనాబేగం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యం.లక్ష్మీబాయి, ఎఐటియుసి నగర కార్యదర్శి కమతం యాదగిరి, సర్వేశ్‌, ఎస్‌.కిష్టమ్మ, క్రిష్ణవేణి, మధన్‌సింగ్‌, పుష్పలత, స్వరూప తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img