Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మా ప్రాణం పోయినా సరే మోటారుకు మీటరు పెట్టం : కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం జనగాంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని, జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.అనంతరం బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విద్యుత్‌ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద్ద మోటార్లకు కరెంట్‌ మీటర్లు పెట్టం అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం పాలసీ ఆ రాష్ట్రానికి ఉండాలని కేంద్రాన్ని పలుమార్లు కోరానని చెప్పారు. ‘30 -40 ఏండ్లు కరెంట్‌ లేక బాధపడ్డాం. 30 లక్షల బోర్లు వేశాం. దాన్ని అధిగమించాలని చెప్పి చెరువులను బాగు చేసుకున్నాం. చెక్‌ డ్యామ్‌లను నిర్మించుకుంటున్నాం. భూగర్భజలాలు పెరిగాయి. పెట్టుబడి సాయం చేస్తున్నాం. వలసలు పోయినొల్లు మళ్లీ తిరిగి వస్తున్నారు. నరేంద్ర మోదీతో రెండేండ్ల నుంచి పంచాయితీ నడుస్తోంది. కరెంట్‌ సంస్కరణ పేరిట మోదీ మోసం చేస్తున్నారు. ప్రతి మోటార్‌కు మీటర్‌ పెట్టాలని అంటే.. నన్ను చంపినా పెట్టనని చెప్పాను. ఎందుకంటే రైతు పంట పండిస్తే రైతే బతకడు కదా? ఇప్పుడు డిజీల్‌ రేట్లు పెరిగాయి. దాంతో రైతులకు ట్రాక్టర్లతో దున్నడం భారమైంది. ఆదాయం రెట్టింపు చేయడం ఏమో కానీ.. రైతుల పెట్టుబడి రెట్టింపు చేసిండు మోదీ. చంద్రబాబు కూడా బావుల కాడ మీటర్‌ పెట్టాలని అన్నడు. నరేంద్ర మోదీ విద్యుత్‌ సంస్కరణల పేరిట బావుల కాడ మోటార్లు పెట్టాలని అంటున్నారు.
మీరు పండిరచే ధాన్యం కొనం. కరెంట్‌ మీటర్‌ పెట్టాలి. లేదంటే దాడులు చేస్తాం అని కేంద్రం అంటోంది. ఇదేనా దందా.. దీని కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్నాం. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలను ఆదుకుంటున్నాం.. అండగా నిలుస్తున్నాం. గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం.’ అని చెప్పారు. ‘మోదీ మా ప్రాణం పోయినా సరే కరెంట్‌ బావులకు మోటార్లు పెట్టం. నువ్వు ఏం చేసినా మంచిదే. తిరగబడుతాం. కొట్లాడుతాం. అవసరమైతే దిల్లీ దాకా వస్తాం. ఏం చేస్తావో చేసుకో. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయం. దీన్ని మీద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img