Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ సాయంతోనే అదానీ దోపిడీ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌
విశాలాంధ్ర, హైదరాబాద్‌ : భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలా కుతలం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రమాదంలోకి నెడుతున్న అదానీ ఆర్థిక మోసాలపై సెబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేసులు పెట్టడానికి బదులుగా కాపలా కాస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ తీవ్రంగా విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయించేస్తున్నారని అన్నారు. తక్షణమే అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లేదా సుప్రీం కోర్డు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 25 నుంచి 27 వరకు పాండిచ్చేరిలో జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాలలో దేశంలోని రాజకీయ పరిస్థితులు, రాబోయే సార్వత్రిక ఎన్నికలపై చర్చిస్తామని వెల్లడిరచారు. హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఇ.టి.నర్సింహలతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వీధి కుక్కలపై గోల ఎక్కువైందని, అంతకు మించి దేశానికి ప్రమాదకారిగా మారిన అదానీ గురించి దృష్టి సారించాలని నారాయణ పేర్కొన్నారు. మోదీ సహాయం లేకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ రెండవ స్థానానికి చేరడం సాధ్యం కాదని అన్నారు. గతంలో అదానీకి అప్పులు ఇవ్వమని చెప్పిన ప్రధాని మోదీ… ఆస్ట్రేలియాలో గనులు ఇప్పించి, అదానీకి ఎస్‌బీఐ నుంచి అప్పు ఇప్పించారని అన్నారు. తాలిబాన్లకు అదానీకి సంబంధాలు ఉన్నాయని, వారు పండిరచే గంజాయిని అదానీకి చెందిన ముంద్రా పోర్టు ద్వారా దిగుమతి చేసుకొని దేశమంతా సరఫరా చేస్తారని చెప్పారు. అందుకు వీలుగా దేశంలోని వివిధ పోర్టులను అదానీకి కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం సహకరించిందన్నారు. జీవీకే సంస్థను బెదిరించి ముంబై ఎయిర్‌ అదానీకి కట్టబెట్టారని అన్నారు. అదానీ పోర్టులకు రవాణా సౌకర్యం కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హైవేలను నిర్మిస్తోందన్నారు. దండకారణ్యంలోని ఖనిజాలను తీసుకెళ్లేందుకు ఛత్తీస్‌గఢ్‌ నుండి దక్షిణాదిలో పోర్టులకు హైవేలు వేస్తున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన 30 వేల ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని డంపింగ్‌ యార్డుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్కడ నుంచి దక్షిణ భారత దేశాన్ని కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒక్క ముంద్రా పోర్టును సీజ్‌ చేస్తే భారతదేశమంతటా డ్రగ్స్‌ సరఫరా కాకుండా నిరోధించవచ్చన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img