Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి

మంత్రి నిరంజన్‌ రెడ్డి
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీకి వచ్చామని..రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నామని… వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలని కోరారు. తమను నిరీక్షించేలా చేయడమంటే రైతులను అవమానించడమే అని మంత్రి అన్నారు. మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రవల్లి దయాకర్‌ రావ్‌, ఎంపీలు కేకే, నామానాగేశ్వర రావుతో కలిసి మంత్రి నిరంజన్‌ రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసమే దిల్లీకి వచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి సమయం ఇచ్చేవరకు వేచిచూస్తామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పండే ప్రతి గింజా కొనుగోలు చేస్తామని.. కేంద్రమంత్రులు చెబుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అయితే ప్రకటనలు కాకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కోటి 30 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ను పెంచాలని గతంలోనే కోరామని తెలిపారు. వరి ధాన్యం కోసం ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వానాకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ ఇచ్చిందని, 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో వరి కోతలే జరగలేదని, జనవరి 15 వరకు వరి కోతలు ఉంటాయని, 5 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉందని చెప్పారు. నేటితో కేంద్రం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టార్గెట్‌ పూర్తవుతుందని చెప్పారు.కేంద్రంతో ఇప్పటికే చేదు అనుభవాలు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని చెప్పారు. వానాకాలం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇతర దేశాలకు ఎగుమతిపై రాష్ట్రాలకు అధికారం ఉండదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img