Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వట్టెం ప్రాజెక్టు.. అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాచాల యుగంధర్‌ గౌడ్‌

హైదారాబాద్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వట్టెం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్‌ గౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. రిజర్వాయర్‌ దగ్గర నాణ్యత లేని పనులు జరుగుతున్నాయని, తమకు సరైన పరిహారం ఇవ్వలేదని ముంపు గ్రామాల ప్రజలు రాచాల దృష్టికి తీసుకెళ్లారు. 11వ ప్యాకేజీలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి, తన దృష్టికి వచ్చిన విషయాలపై ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బాగమైన బిజినేపల్లి మండలంలోని వట్టెం రిజర్వాయర్‌ పూర్తి అయితే ఎన్నో వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని వేచి చూస్తున్న ప్రజలకు ప్రాజెక్టు నిర్మాణాలలో నాణ్యత లేకపోవడంతో గత ఆరేళ్లుగా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ ప్రజలచేత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేయకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రాజెక్టు ప్రమాదానికి గురైతే ఎన్నో గ్రామాలు నీట మునగటంతో పాటు వేల కోట్ల ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి పనులకు పూనుకుంటున్న వారిపై ఫ్రభుత్వంచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులు నాణ్యత విషయంలో చూసి చూడనట్టు వ్యవరిస్తూ కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారని, అలాంటి అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎక్కడయితే నాణ్యత లోపంతో పనులు జరిగాయో వాటిని పరిశీలించి సరిదిద్దాలని, నాణ్యత లేని నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లపై, వారికి సహకరిస్తున్న అధికారులపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మొత్తం కాళేశ్వరానికి ఖర్చుపెట్టి పాలమూరు ప్రాజెక్టులకు మొండి చెయ్యి చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేసే కుట్ర చేస్తున్న కూడా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు చెల్లించినట్లు గా పాలమూరు నిర్వాసితులందరికి 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని, లేని పక్షంలో ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలతో కలిసి ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ అరవిందా చారి, నాయకులు శ్రీనివాస్‌, శివాజీ, శేఖర్‌ గౌడ్‌, బలిజ రమేష్‌, శంకర్‌ గ్రామస్తులు రాజు నాయక్‌, శివ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img