Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరద నష్టపరిహారం 25వేలు ఇవ్వాలి : వైఎస్‌ షర్మిల డిమాండ్‌

వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ముంపునకు గురైన ఆదిలాబాద్‌ జిల్లా, పెద్దపల్లి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల, వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలలో ఆస్తి నష్టం గురించి బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం సహాయం అందిస్తామని చెబుతున్నా ఇప్పటివరకు ఎటువంటి సహాయం తమకు అందలేదని వారి వైయస్‌ షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో షర్మిల తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరదలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురి కావడానికి సీఎం కేసీఆర్‌ వైఫల్యమే కారణం అంటూ మండిపడ్డారు. అవగాహన లేకుండా ప్రాజెక్టులు కట్టి ప్రజలకు ఇటువంటి పరిస్థితిని తీసుకువచ్చారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వరదలతో సర్వం కోల్పోయారని, పంట నష్టపరిహారం ఇస్తామని అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. ఇప్పటివరకు పంట నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆమె కేసీఆర్‌ను ప్రశ్నించారు. వరద బాధితులకు నష్టపరిహారం పది వేలు కాదు, 25 వేలు ఇవ్వాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. వరదలు వస్తాయి అని తెలిసినా, వరద ముంపు ప్రాంతాలపై ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరించిందని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా టీిఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌ నుండి నష్టపరిహారం అందించాలని వైయస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో 860 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రతి నెలా వడ్డీ కింద మూడు కోట్ల రూపాయలు వస్తుందని కేసీఆర్‌ చెబుతున్నాడని పేర్కొన్న షర్మిల, టీిఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌ నుండి ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప హౌస్‌ లు కాపాడుకోలేని కేసీఆర్‌ కడెం ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, మూడేళ్ల నుండి గేట్లు మార్చాలని చెబుతున్న కేసీఆర్‌ పట్టించుకోలేదని, ఇక గేట్లను మేనేజ్‌ చేసే సిబ్బంది 33 మంది ఉండాల్సిన చోట కేవలం ముగ్గురే ఉన్నారని వైయస్‌ షర్మిల ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ లను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో సీఎం కేసీఆర్‌ ఉన్నారంటూ వైఎస్‌ షర్మిల విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img