Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విద్వేషం.. విభజన కాదు… అభివృద్ధి, వికాసమే ప్రధానం

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ
ఆవోదేఖోసీకో అంటూ దెప్పిపొడుపు

హైదరాబాద్‌:
విద్వేషం.. విభజన ఎజెండా కాకుండా… అభివృద్ధి, వికాసం గురించి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడాలని, మంత్రి కేటీఆర్‌ బీజేపీకి సూచించారు. శనివారం, ఆదివారం నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోదీ హైదరాబాద్‌ రానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మోదీకి సుదీర్ఘమైన లేఖ పంపారు.
ఆవోదేఖోసీకో…
ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. పార్టీ డీఎన్‌ఏలోనే విద్వేషాన్ని, సంకుచిత్వం నింపుకున్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం అత్యాశే అని తెలుసు. వినూత్న పథకాలు, నూతన పరిపాలన విధానాలపై మాట్లాడే స్థాయికి ఎన్నడూ చేరుకోలేని మీ పార్టీ సమావేశాల రియల్‌ అజెండా విద్వేషం. అసలు సిద్ధాంతం విభజనే అని అందరికి తెలుసని కేటీఆర్‌ పేర్కొన్నారు. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. అభివృద్ధి విషయంలో మీ పార్టీ నూతన ప్రారంభం చేయడానికి తెలంగాణకు మించిన ప్రదేశం ఇంకొకటి లేదు. తెలంగాణ ప్రాజెక్టులు, పథకాలు, సుపరిపాలన విధానాలు, ప్రాధాన్యతలను అధ్యయనం చేయండని సూచించారు. అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి.. మత సామరస్యంతో కూడిన వసుదైక కుటుంబం లాంటి సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండని మోదీకి కేటీఆర్‌ సూచించారు.
శాంతియుత తెలంగాణ తరపున స్వాగతం..
హైదరాబాద్‌కు వస్తున్న బీజేపీ నాయకులకు.. మతాలు, ప్రాంతాల పేరిట సంకుచిత మనస్తత్వం లేని శాంతియుత తెలంగాణ తరపున స్వాగతం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా మారి అద్భుతమైన అభివృద్దితో ప్రపంచపటంపై తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న హైదరాబాద్‌లో మీ పార్టీ సమావేశం పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం ఏమీ అనిపించడం లేదు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌లు కొలువైన మీ రాష్ట్రాల్లో ఇప్పటికీ నెలకొన్న దుర్భర పరిస్థితులే మిమ్మల్ని తెలంగాణకు రప్పించి ఉంటాయని నేను భావిస్తున్నాను. కారణాలు ఏవైనా మీ పార్టీ నాయకత్వం మొత్తం హైదరాబాద్‌లో మకాం పెడుతున్న ఈ సందర్భంలోనైనా కాసింత తెలంగాణతనాన్ని నేర్చుకోవాలని, ఇక్కడి గాలి గానం చేసే గంగా జమునా తెహజీబ్‌ను గుండెల నిండా నింపుకోండని సలహా ఇస్తున్నాను.
తెలంగాణకు మించిన గొప్ప ప్రదేశం ఇంకొటి లేదు..
ఇరిగేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్నోవేషన్‌, ఇంక్లూజివ్‌నెస్‌ వంటి వినూత్నమైన విధానాలతో, సమ్మిళిత అభివృద్ధి నమూనాతో చరిత్ర సృష్టిస్తున్న ఈ తెలంగాణ గడ్డ మీ రాజకీయాలు, ఆలోచనలను మార్చుకునే అవకాశం ఇస్తోంది. అందరిని కలుపుకొని పోయే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్పూర్తితో అభివృద్ధి ఏజెండాను చర్చించేందుకు తెలంగాణకు మించిన గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు. అయితే మీ విధానాలు, నినాదాలను మార్చుకుంటారో లేదంటే, మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటారో మీ ఇష్టం. అబద్దాల పునాదులపై పాలన సాగిస్తున్న మీకు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందని అనుకోవడం లేదు. కానీ మీ అస్తవ్యస్థ విధానాలు, అసమర్థ పాలనతో కలుగుతున్న దుష్పరిణామాలను అనుభవిస్తున్న ఈ దేశ పౌరుడిగా ఈ మాత్రం ఆశించడం అత్యాశ కాదనుకుని మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. దేశానికి సరికొత్త దిశను నిర్దేశిస్తున్న తెలంగాణ విజయాలను అధ్యయనం చేయడానికి ఈ రెండు రోజుల సమయం మీకు సరిపోదని తెలుసు. కానీ మీ కేంద్ర ప్రభుత్వమే శభాష్‌ అని మెచ్చుకున్న తెలంగాణ విజయాలను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికే మీరు ప్రవేశపెట్టిన పలు పథకాలకు మా తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యక్రమాలే స్ఫూర్తి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
చివరగా దమ్‌ బిర్యానీ రుచి చూడండి..
చివరగా ఒక్కమాట. హైదరాబాద్‌ మెహమాన్‌ నావాజ్గీ కీ బాత్‌ హీ కుచ్‌ అలగ్‌ హై అంటారు. అందుకే హైదరాబాద్‌లో దమ్‌ బిర్యానీ రుచి చూడండి. శాఖహారుల కోసం వెజ్‌ బిర్యానీ కూడా ఉంటుంది అడగడం మర్చిపోకండి. ఇరానీ చాయ్‌ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన అలోచనా విధానానికి నాంది పలకండి. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి. అందుకే అంటున్నాం ‘‘ఆవో… దేఖో…సికో’’ అంటూ కేటీఆర్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img