Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయం : మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో మళ్లీ పగ్గాలు చేపట్టేది గులాబీ పార్టీనే అని.. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జోస్యం చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి 90కి పైగా స్థానాలు వస్తాయని తమ సర్వే చెబుతుందని.. లెక్క ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ఒక్క పార్టీయే రాష్ట్రం అంతటా ఉందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో బలంగా ఉన్న నేతలను పార్టీ కలుపుకొని పోతుందని వివరించారు. కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ సర్వే చేసినా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ప్రజల నుంచి తమకు లభిస్తున్న మద్దతును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.తమకు ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని మరోసారి స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే 2023లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. అలా కాకుండా ప్రతిపక్షాలు కోరుకుంటే తాము ఎన్నికలకు సిద్ధమని.. వాళ్లు తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్‌ చేసిన సవాల్‌ ఏ పార్టీ స్వీకరించలేదని, బీజేపీ నుంచి స్పందన లేదన్నారు. కేసీఆర్‌ ఎవరికీ బెదరడు.. లొంగడు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కేటీఆర్‌ కామెంట్‌ చేశారు. వాపును చూసి కొందరు బలుపు అనుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ మోదీ, ఈడీ అని ఎద్దేవా చేశారు. మంచి పనులతో ప్రజల మనసులను గెలవడం బీజేపీకి తెలియదన్నారు. రాహుల్‌ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చచ్చిపోయిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సిరిసిల్లకు రాహుల్‌ గాంధీ వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చి నేర్చుకోమనండి అని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img