Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీనియర్‌ జర్నలిస్టు కె.ఎల్‌. రెడ్డి మృతి .. పలువురు సంతాపం

సీనియర్‌ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) గురువారం తెల్లవారుజామున వరంగల్లులో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కె.ఎల్‌.రెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1950లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కె.ఎల్‌.రెడ్డి సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపారు.
కెఎల్‌ రెడ్డి ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, నేటి నిజం, సాయంకాలం, మహానగర్‌ పలు పత్రికల్లో పని చేశారు. కె.ఎల్‌. రెడ్డి మరణం పట్ల ప్రముఖ సంపాదకులు ఎం.విఆర్‌. శాస్త్రి, సీనియర్‌ జర్నలిస్టులు డాక్టర్‌ మాడభూషి శ్రీధర్‌, గోవిందరాజు చక్రధర్‌, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు, ఉపాధ్యక్షులు ఉడయవర్లు, కార్యదర్శి కొండా లక్ష్మణరావు తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కంచర్ల లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం
సీనియర్‌ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి నిరాడంబర జీవితం గడిపారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కంచర్ల లక్ష్మారెడ్డి మరణం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంతాపం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img