Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..

భారీగా ట్రాఫిక్‌ జామ్‌, వాహనదారుల అవస్థలు
హైదరాబాద్‌లో సోమవారం ఉదయం భారీ వర్షం దంచికొట్టింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. హైదరాబాద్‌ మహానగరం మరోసారి భారీవర్షంతో తడిసి ముద్దయింది. సోమవారం ఉదయం ఎండ కాయగా.. 10 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు ఏర్పడి కుండపోత వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, బాలానగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బేగంపేట, ఖైరతాబాద్‌, కుత్బుల్లాపూర్‌, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వానతో నగరంలోని పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బంజారాహిల్స్‌, పంజాగుట్ట ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు వర్షంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేసింది. నగరంలో గత 15 రోజులుగా రోజూ ఏదొక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయా అని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
మరో నాలుగు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడిరచింది. ఆగస్టు 3, 4 తేదీల్లో భారీ వర్షాలు పడే చాన్స్‌ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img