తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం మంత్రి ప్రశాంత్‌రెడ్డి శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. అదెప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తారు. సచివాలయ ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత తన సీట్లో కూర్చుంటారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు, సీఎంవో, సచివాలయ సిబ్బంది తమ చాంబర్లలో కూర్చుంటారు. ప్రారంభ కార్యక్రమానికి మొత్తం 2,500 మందిని ఆహ్వానిస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు తదితరులు ఉంటారు.సందర్శకులను మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆగ్నేయ ద్వారం ద్వారా అనుమతిస్తారు. మెయిన్ గేటును మాత్రం ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్, ముఖ్యమైన ఆహ్వానితులు, దేశవిదేశీ అతిథులు, ప్రముఖుల కోసం వినియోగిస్తారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ బగ్గీలను ఉపయోగిస్తారు. సచివాలయంలోకి ప్రైవేటు వాహనాలను అనుమతించరు.