Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

7న నేతన్న బీమా ప్రారంభం

మంత్రి కేటీఆర్‌

విశాలాంధ్ర-హైదరాబాద్‌: నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం రోజు నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5లక్షలు అందజేస్తామన్నారు. లబ్దిదారులు చనిపోయిన పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికుల ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఈ పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్‌ ఏజెన్సీగా ఉంటుందన్నారు. నేతన్న బీమా కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్‌ లూమ్‌ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని ఎల్‌ఐసీకి చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసంరూ.50 కోట్ల్లు కేటాయించామన్న కేటీఆర్‌, రూ.25 కోట్లను ఇప్పటికే విడుదల చేశామన్నారు. 60 సంవత్సరాల లోపు ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులందరూ ఈ నేతన్న బీమా పథకానికి అర్హులే అన్నారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్‌ లభిస్తుందన్నారు. ఇక ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. అర్హులైన చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికులు, అనుబంధ కార్మికులు అందరికి నేతన్న బీమా పథకాన్ని అమలుచేస్తామన్నారు. చేనేత, జౌళి రంగానికి చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఏ ప్రభుత్వము కేటాయించని విధంగా 2016-2017 నుంచి ప్రతి సంవత్సరం ప్రత్యేక బడ్జెట్‌ (బీసీ వెల్ఫేర్‌ నుండి) రూ.1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్‌ బడ్జెట్‌కు ఇది అదనమన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్‌ కింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్‌ కింద స్పెషల్‌ బడ్జెట్‌ రూపంలో మరో రూ.400కోట్లు కూడా కేటాయించామన్నారు. కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం చేనేత మిత్ర స్కీం, నేతన్నకు చేయుత, చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, చేనేత రంగంలో పరిశోధన – అభివృద్ధి బ్రాండ్‌ ప్రమోషన్‌ – మార్కెటింగ్‌, బతుకమ్మ చీరల ఉత్పత్తి, మరమగ్గాల కార్మికులకు త్రిఫ్టు నిధి, అలాగే చేనేత రంగంలో పావలా వడ్డీ పథకం, మగ్గముల ఆధునీకరణ పథకం, చేనేత వస్త్ర ప్రదర్శన, చేనేత రంగంలో శిక్షణ – మౌళిక సదుపాయాల కల్పన, మార్కెట్‌ ఇన్సెంటివ్స్‌, హ్యాండ్లూం పార్కు గద్వాలను ఏర్పాటు చేశామన్నారు. అదే సమయంలో పవర్‌ లూం రంగంలో సిరిసిల్ల టెక్స్‌ టైల్‌ పార్కు, మినీ టెక్స్‌ టైల్‌ పార్కు వరంగల్‌, టి-టాప్‌ 2017-2020, సిరిసిల్ల అప్పారెల్‌ పార్కు, వర్కర్‌-టు-ఓనర్‌ పథకం, మరమగ్గాల సేవా కేంద్రం ఏర్పాటు, మరమగ్గాలకు వినియోగించే విద్యుత్తు పై 50శాతం సబ్సిడీ, మరమగ్గాల ఆధునీకరణ మొదలగు కార్యక్తమలను తీసుకున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img