వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ్‌బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది జార్ఖండ్, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంటకు 45ఉ55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కూడా బుధ, గురువారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమబెంగాల్ ఒడిసా తీరాల్లోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిసాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు మినహా పెద్ద వర్షాలు కురవలేదనే చెప్పాలి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణవాఖ శుభవార్త చెప్పింది.