Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మణిపూర్‌ అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర

. సీపీఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, పాషా
. హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : మణిపూర్‌ రావణ కాష్టంలా కాలుతున్నప్పటికీ ప్రధాని మోదీ నోరువిప్పకపోవడం అత్యంతదారుణమని, మణిపూర్‌ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదా అని సీపీఐ, సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతోనే మణిపూర్‌ ముఖ్యమంత్రి అల్లర్లను ప్రొత్సహిస్తున్నారన్నారు. మత ఘర్షణలతో రాజకీయ లబ్ధిపొందాలని కుట్ర చేస్తున్న బీజేపీని కేంద్రంలో గద్దె దించాలని, అందుకు ప్రజాస్వామ్య, లౌకకవాద శక్తులన్నీ ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలపై దాడులకు పాల్పడడమే ‘‘బేటీ బచావో’’ నినాదమా అని ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్‌ అల్లర్లను అరికట్టండి..ప్రజల ప్రాణాలను కాపాడండి…మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలి’’ అనే డిమాండ్‌తో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లిబర్టీ నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహిం చారు. ‘బీజేపీ హఠావో… దేశ్‌కా బచావో, మణిపూర్‌ సిఎం రాజీనామా చేయాలి..చేయాలి…ఆర్‌ బావజాలానికి వ్యతిరేకంగా, విద్వేష రాజకీయాలకు వ్యతిరకంగా పోరాటం చేయాలి’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నల్ల జెండాలను చేతబూని ప్రదర్శనలో పాల్గొ న్నారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీపీిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ మణిపూర్‌ చైనా ద్వారా ఆయుధాలతో టెర్రరిస్టులు దేశంలోకి చొరబడుతున్నప్పటికీ కేంద్రం, మణిపూర్‌ బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. టెర్రరిస్టులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా ఉండాలని, అల్లర్లను అదుపు చేయాలని ఇప్పటి వరకు ప్రధాని మోదీ కోరలేదన్నారు. మణిపూర్‌ మహిళలపై అత్యాచారం, ఉరేగింపు తీసిన వీడియోను పార్లమెంట్‌ సమావేశాలకు ఒక రోజుముందుగా ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని, ఈ ఘటనలో సుప్రీం కోర్ట్టు సూచనలను కూడా బీజేపీి ప్రభుత్వం తమకు అనులంగా మల్చుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో చర్చకు రానివ్వకుండా, అదే సమయంలో మణిపూర్‌ ఘటన అంశంలో సుప్రీం కోర్ట్టు సూచనను చూపిస్తూ ఇతర అంశాల నుంచి తప్పించుకుంటున్నారని నారాయణ విమర్శించారు. సీపీిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ బేటి బచావో అని నినదించిన ప్రధాని మోదీ బేటీల విషయంలో ఏం చేస్తున్నారని నిలదీశారు. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం చలనం లేదని, కనీసం బాధ కూడా లేదన్నారు. మణిపూర్‌ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని అజీజ్‌ పాషా డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ, అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకు నేందుకు కేంద్రంలోని బీజేపీి ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మతవిద్వేషాలను రెచ్చగొడుతూ మెజార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మతఘర్షణల ద్వారానే బీజేపీ ఎదుగుతోందని విమర్శించారు. అక్కడే మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. మణిపూర్‌ ఘర్షణలు రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ అధ్యక్షత వహించగా హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి వందన సమర్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్‌ బోస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఉస్తేల సృజన, సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.చాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్‌, కార్యవర్గ సభ్యులు నెర్లకంటి శ్రీకాంత్‌, ఎండీ సలీం, పడాల నళిని, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహరావు,మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img