హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఒక సినిమా ప్రేక్షకుడిపై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ దాడి చేయడం కాసేపు టెన్షన్ క్రియేట్ చేసింది. ఒక వ్యక్తి ఆదిపురుష్ సినిమా చూసేందుకు ట్యాంక్‌బండ్ సమీపంలోని ఐమ్యాక్స్ థియేటర్‌కు వచ్చాడు. తొలి రోజు కావడంతో సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు అడగడంతో రివ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆదిపురుష్ సినిమా బాగా లేదని రివ్యూ చెబుతుండటంతో అభిమానులు అతడిని అడ్డుకున్నారు. అతడిపై దాడి చేసి చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేక్షకుడు యూట్యూబ్ ఛానెళ్లకు బైట్ ఇస్తుండగా.. కొంతమంది ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. గొడవ మరింత పెరగడంతో సదరు వ్యక్తిని కొంతమంది కలిసి కొడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. పిడిగుద్దులతో అతడిని పొట్టుపొట్టు కొట్టి వదిలేశారు. ఈ ఘటనలో థియేటర్ల వద్ద కొద్దిసేపు టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సినిమా విడుదల రోజు థియేటరల్ వద్ద అభిమానులు హల్‌చల్ చేస్తున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక థియేటర్ వద్ద ఓ యువకుడు బీర్ బాటిళ్లు పగులకొట్టి చేతికి గాట్లు పెట్టుకున్నాడు. కొంతమంది ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా అలాగే చేశాడు. చేతి నుంచి రక్తం వస్తున్నా ఆగకుండా అలాగే పలుమార్లు గాట్లు పెట్టుకున్నాడు. ప్రభాస్ పోస్టర్ ముందు బీర్ బాటిల్ పెంకులు చేతిలో పట్టుకుని చేయి కోసుకుంటూ డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. అభిమానుల వెర్రి చూసి కొంతమంది షాక్ అవుతున్నారు. ఇలా కొన్నిచోట్ల ఫ్యాన్స్ శృతిమించి ప్రవర్తించిన ఘటనలు వివాదానికి దారితీస్తున్నాయి.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ విడుదల అవ్వగా.. తొలిరోజు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. భారత్‌తో దాదాపు అన్ని ప్రధాన భాషల్లో సినిమాను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మేనియా కొనసాగుతోంది. సినిమా చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వారం ఇలాగే థియేటర్ల వద్ద రద్దీ కనిపించనుంది.