Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

చేనేతపై జీఎస్టీ మరణ శాసనమే

తెలంగాణ చేనేత కళానైపుణ్యాలు భారతీయ సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలు
బ జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి కేటీఆర్‌

విశాలాంధ్ర` హైదరాబాద్‌: కేంద్ర నిర్ణయం చేనేత పరిశ్రమకు అశనిపాతం వంటిదని, కొన ఊపిరితో ఉన్న పరిశ్రమపై జీఎస్టీ విధించడం మరణ శాసనం రాసినట్టేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీపుల్స్‌ ప్లాజాలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ చేనేత కళానైపుణ్యాలు భారతీయ సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. దేశంలోనే చేనేతరంగంపై జీఎస్టీని ఎత్తివేయాలని తెలంగాణ తరపున చేతులు జోడిరచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. చేనేత దినోత్సవమైన ఆగస్టు 7నే రైతు బీమా తరహాలో నేతన్న బీమా సౌకర్యం అమలులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. చేనేత, మగ్గాల కార్మికులకు బీమా సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నేతన్న బీమా ద్వారా 80 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే రూ.5లక్షల బీమా అందుతుందన్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జాతిపిత మహాత్మాగాంధీ చరకాను ఒక చిహ్నంగా తీసుకొని.. నూలు వడుకుతూ ప్రజలను స్వదేశీ ఉద్యమం వైపు మళ్లించారన్నారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు గాంధీ చరకా పట్టి నూలు వడికితే జాతి మొత్తం కదిలిందని గుర్తు చేశారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన తరుణంలో కేంద్రం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దురదృష్టకరమన్నారు. చేనేత, మరమగ్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేటీఆర్‌ వివరించారు. చేనేత మిత్రద్వారా 50శాతం రాయితీ అందిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా చూస్తున్నామన్న కేటీఆర్‌… ప్రతి సోమవారం ఉద్యోగులు నేత వస్త్రాలను ధరించాలని విజ్ఞప్తి చేశారు. రామప్ప చేనేత చీరలను ఆవిష్కరించడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎమ్మెల్సీ రమణ, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి , చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img