వారి మధ్య స్నేహపూర్వక భేటీ జరిగిందని వెల్లడి
షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ… తమ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను షర్మిల కలిశారన్నారు. వారి మధ్య స్నేహపూర్వక భేటీ జరిగిందని తెలిపారు. షర్మిల కూడా ఇటీవల ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనంపై వేచి చూడాలన్నారు.షర్మిల గత నెల 31న సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియాతో నిర్మాణాత్మక చర్యలు జరిగాయన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ… వైఎస్ రాజశేఖర రెడ్డిపై కేసులు వేయడం వంటి అంశాలపై కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా వెళ్తోందనే ప్రచారం సాగుతోంది.