Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గండీడ్‌కు చెందిన తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 15కు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఉపాధి హామీలో కాంట్రాక్టర్‌గా తిరుపతయ్య పనిచేస్తున్నాడు. ఏఈ పేపర్‌ను డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య తీసుకుని రాజేంద్ర కుమార్‌కు అమ్మినట్లు తేలింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక సొంత మండలం గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందినవాడిగా తిరుపతయ్యను గుర్తించారు. తిరుపతయ్య నుంచి పేపర్ తీసుకున్న రాజేంద్ర కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేయగా.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తిరుపతయ్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోన్నారు. అయితే మరో ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని నాంపల్లి కోర్టును కోరారు. దీంతో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్‌లను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుండటంతో.. ఏం జరుగుతందనేది కీలకంగా మారింది. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్య, ఏ5 కేతావత్ రాజేశ్వర్‌లను మూడు రోజుల కస్టడీకి కోర్టు ఇటీవల అప్పగించింది. దీంతో నేడు రెండోరోజు వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకరి ద్వారా ఒకరు పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.10 లక్షలకు పేపర్ అమ్ముకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇంకా ఎంతమందికి పేపర్ లీక్ చేశారనేది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చాలామందికి లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఈ పేపర్‌, గ్రూప్-1తో పాటు అనేక పేపర్లు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో విచారణ చేసే కొద్ది అరెస్ట్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో ఇంకెంతమంది అరెస్ట్ అవుతారనేది చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img