Sunday, July 20, 2025
Homeఆంధ్రప్రదేశ్అభాగ్యుల కలెక్టర్…. వెంకట మురళి

అభాగ్యుల కలెక్టర్…. వెంకట మురళి

• ఏడాది పాలనలో చెరగని ముద్ర
• ప్రజల మనసులను చొరగొన్న కలెక్టర్ వెంకట మురళి
• విధుల పట్ల అంకితభవం.. పాలనలో నిబద్ధతకు నిదర్శనం
• నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ ప్రయత్నాలు
• వరదల వేళ కలెక్టర్ స్పందన అద్భుతం..
• పి-4 లో రాష్ట్రం లోనే ప్రథమం
• తరతరాలు పేదరికంలో ఉన్న గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు
• ఎస్టీల ఆధార్ నమోదుకు శ్రీకారం
• గిరిజనులు- దివ్యాంగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్
• చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపులో కలెక్టర్ పాత్ర
• గవర్నర్ చేతుల మీదుగా బంగారం పతకం అందుకున్న వెంకట మురళి
• సంతృప్తికరంగా ఏడాది పాలన

విశాలాంధ్ర – బాపట్ల :
ఆయనకు కలెక్టర్ ఉద్యోగం అంటే గొప్ప హోదా అని ఏనాడు అనుకోలేదు. ఇదంతా బాధ్యతగానే భావించారు. విద్యార్థి దశ నుంచే ప్రజలకు సేవ చేయడం ఎలా అని ఆలోచించేవారు. దీనికి ప్రభుత్వ ఉద్యోగమే సరైన మార్గం అని ఎంచుకున్నారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడంతో పేదరికం ఆయనకు అడ్డు రాలేదు. మొదట సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో చేరారు. తనకిచ్చిన పనిలో ప్రజల ప్రేమను పొందారు. ప్రజాసేవకు పరిధి పరిమితంగా ఉండడంతో ఇంతకంటే ఉన్నత ఉద్యోగానికి వెళ్లాలని ఆకాంక్షించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివడం… ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత స్థాయి రాష్ట్ర ప్రధమ ర్యాంకర్ గా నిలిపింది. ఆయనే మన బాపట్ల జిల్లా కలెక్టర్ జరుగు వెంకట మురళి. సబ్ కలెక్టర్ గా పరిపాలన విభాగంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించారాయన. 2024 జులై 4వ తేదీన బాపట్ల జిల్లా కలెక్టర్ గా చేరడంతో ఆయన బాధ్యత మరింత పెరిగింది. ఇలా ఉద్యోగన్నతి పొందడం, తనలో ఉన్న సేవా గుణానికి అధికార పరిమితులు అధికమయ్యాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రతిక్షణం అంకితభావం దర్శనమిస్తోంది. సమాజంలో నిరాదరణకు గురైన దివ్యాంగులు, ఎస్టీలకు న్యాయం చేయాలని ప్రతినెల నాలుగో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు.

బాపట్ల జిల్లా అభివృద్ధికి : ….
నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా వ్యవసాయం, మత్స్య, చేనేత రంగాలలో వ్యాపార వృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించారు. బాపట్లలోని పర్యాటక వనరులను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. ఈ రంగాల అభివృద్ధితో జిల్లాకే గాకుండా రాష్ట్రానికి ఆదాయ వనరు, ఆదర్శంగా మార్చడమే ఆయన లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలు, కళాకారులను సమన్వయం చేసుకుంటూ వివిధ రకాలుగా ప్రణాళికలు రూపొందించారు. అవన్నీ ఇప్పుడు కార్యాచరణలో ఉన్నాయి. జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన తొలినాళ్లలోనే అన్ని ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనకు ముందే విదేశీ వర్తక వాణిజ్య కేంద్రంగా ఉన్న మోటుపల్లి ఓడ రేవును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు చారిత్రక పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలతో పలుమార్లు చర్చించారు. అలనాటి వీరభద్ర స్వామి దేవాలయాన్ని మ్యూజియం, పర్యాటక ప్రాంతంగా చేయడానికి చర్యలు ప్రారంభించారు. భూమి కేటాయించడంతోపాటు చారిత్రాత్మక సంపదగా ఉన్న వీరభద్రస్వామి విగ్రహాన్ని తెప్పించేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు.
విపత్తులో ప్రజలకు తోడుగా : …
కృష్ణానది వరద విపత్తులు గతేడాది సెప్టెంబర్ 2 లో సంభవించగా నేనున్నానంటూ లంక గ్రామాల ప్రజలకు ధైర్యం కల్పించి ప్రభుత్వ సహాయం అందించడంలో కృతార్థులయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా కృష్ణానది చెరువులోని కొల్లూరు ప్రాంతంలో ప్రజల మధ్యనే ఉండి సహాయక చర్యలు అందించారు. వరదలో చిక్కుకున్న 30 వేలమంది నిరాశ్రయులను తన కుటుంబ సభ్యులుగా భావించి అన్ని తానై నిలిచి సేవలందించారు. వరద విపత్తుతో నీట మునిగిన గ్రామాలకు పడవల ద్వారా తాగునీరు, ఆహార పదార్థాలను ఐదు రోజులు పాటు అందించడం, తదుపరి 24 గంటల్లోనే రహదారులు, విద్యుత్ ను పునరుద్ధరించారు. సహాయక చర్యలు అందించడంలో జిల్లా కలెక్టర్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం భేష్ అని అభినందించగా, రాష్ట్ర గవర్నర్ బంగారు పతకంతో సత్కరించారు. ప్రజలకు విశేష సేవలు అందించే రెడ్ క్రాస్ సంస్థ సభ్యత్వ నమోదులోనూ బాపట్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలువగా గవర్నర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకున్నారు.
ఎస్టీలకు ఆధార్: …
చెరువులు, కాల్వల గట్లపై దుర్భర జీవితం సాగిస్తున్న ఎస్టీలకు జీవనాధారం కల్పించారు. వారి జీవన స్థితిగతులను గుర్తించిన కలెక్టర్ డిసెంబర్ నెలలో సర్వేకు ఆదేశాలిచ్చారు. 48,700 ఎస్టీలను సర్వే చేయగా 1,900 మందికి ఆధార్ కార్డులు లేనట్లుగా గుర్తించారు. వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆర్డీవోలు పంచనామా నిర్వహించాలని ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్ తో జనన, చిరునామా ధ్రువీకరణ పత్రాలను జారీచేసి తద్వారా ఆధార్ కార్డులు అందించారు. తదుపరి పొదుపు సంఘాలలో చేర్పించి స్థిరమైన జీవనోపాధి కల్పించారు. వారికోసం ప్రతి నెల నాలుగో శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తూ వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించి తక్షణమే పరిష్కార మార్గం చూపుతున్నారు.
పర్యాటకంపై ముద్ర : …
బాపట్ల జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో భాగంగా బాపట్ల తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చడానికి చర్యలు ప్రారంభించారు. సూర్యలంక బీచ్ లో వేలాది మొక్కలు నాటించారు. ఆయన రూపొందించిన అభివృద్ధి ప్రణాళికకు కార్యరూపం ఇస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అడవి గ్రామం వద్ద పర్యాటకులు బోట్ షికార్ చేయడానికి వీలుగా తయారుచేసిన ప్రణాళిక త్వరలో రూపుదిద్దుకోనుంది. సూర్యలంక పేరళి కెనాల్ నుంచి నిజాంపట్నం ఓడరేవు వరకు గత ఏడాది జూలై 14 తేదీన ఆయన సాహసోపేతంగా పడవలో ప్రయాణించారు. మడ అడవుల మొక్కల సంరక్షణ, అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ప్రభుత్వం అభినందించింది. వాటి అభివృద్ధికి ఆయన రూపొందించిన ప్రణాళిక అమలుకు అంగీకారం తెలిపింది. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో తీర ప్రాంతాలలో విస్తృతంగా మొక్కలు నాటిస్తున్నారు.
పి-4 లో : … రాష్ట్రం లోనే ప్రథమం
అత్యంత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పి-4 విధానానికి స్వీకారం చుట్టింది. రాష్ట్రమంతా చేపట్టే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్నగంజాం మండలం పెద్దగొల్లపాలెం గ్రామంలోనే ప్రారంభించారు. జిల్లాలో ఇలాంటి 62,388 నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా నామకరణం చేశారు. వారికి ఎలాగైనా సహాయం చేయాలని 3528 మందిని మార్గదర్శిలుగా చేర్చడం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పి-4 కింద 14 కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు జీవనోపాదులవృద్ధికి సాయమందించారు. చీరాలకు చెందిన ఓ ఆనాధ యువకుడిని డిఆర్డిఎ ద్వారా దత్తకు తీసుకుని రూ.50వేలు తక్షణమే సహయం అందిచటంలో కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక చొరవ చూపారు.
స్వచ్ఛత వైపు అడుగులు :
చెత్త రహిత జిల్లా లక్ష్యంగా కలెక్టర్ అడుగులు ముందుకు వేస్తున్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని భావించిన కలెక్టర్ వెంకట మురళి పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకొరకు ఎంపీడీవోలు, డిప్యూటి ఎంపీడీవోలు,గ్రామ కార్యదర్శులతో
బాపట్లలో మే22వ తేదీన చెత్త సంపద కేంద్రాల నిర్వహణ, గ్రామాల పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. రహదారులు వెంట చెత్త కనిపించరాదంటూ అధికారులకు సూచనలు ఇచ్చారు. నెల రోజుల పాటు పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. చెత్త దంప్ చేయటానికి స్థలాల లేని చోట తక్షణమే భూమి కేటాయించాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ ఔదార్యం:
పారిశుధ్యంలోనూ కార్మికుల రక్షణ చర్యలు తీసుకున్నారు. వారికి అవసరమైన గ్లౌజులు, మాస్కులు షూస్, కొబ్బరి నూనె, సబ్బులు, చీపుర్లు, పారలు వంటి పరికరాలు, పనిముట్లను కలెక్టర్ నిధి నుంచి రూ.50లక్షలతో కొనుగోలు చేసి అందించారు. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూనే గ్రీన్ అంబాసిడర్ల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు. అంత మాత్రమే కాకుండా పలు గ్రామాలలో పర్యటించి తడి,పొడిగా చెత్తను ఇంటి వద్దనే విభజించాలని నేరుగా ప్రజలకు వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. చెత్త నుంచి సంపద సృష్టించే విధానంపై ఫోకస్ పెట్టారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవటంలో కలెక్టర్ వెనకాడటం లేదు.
అర్జీదారులకు కడుపునిండా భోజనం :…
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్ కు సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులకు ప్రతి సోమవారం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఆకలితో వెను తిరగకూడదని కలెక్టరేట్ ఆవరణలోనే ప్రతి సోమవారం, నెలలో నాల్గో శుక్రవారం జరిగే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కు వచ్చే అర్జీదారులకు కలెక్టర్ ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు
జిల్లా కలెక్టర్ వినియోగించే సామాజిక మాధ్యమాలలో వచ్చే ఫిర్యాదులకు సైతం ఆయన తక్షణమే స్పందిస్తున్నారు. ఇటీవల కర్లపాలెం మండలంలో పేరలీ గ్రామంలో బెల్టు షాప్ నిర్వహిస్తున్నారని ఓ మహిళ బాపట్ల జిల్లా కలెక్టర్ సామాజిక మాధ్యమంలో ఫిర్యాదు చేశారు. సమస్యపై కలెక్టర్ వేగంగా స్పందించారు.
చీరాల కుప్పడం : …
చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించేలా కలెక్టర్ విశేషంగా కృషి చేశారు. జనవరి 9వ తేదీన కేంద్ర బృందం సభ్యులు ఇష్ దీప్, డాక్టర్ దివ్యడింగ్రా క్షేత్రస్థాయి పరిశీలనపై బాపట్ల చీరాలలో పర్యటించారు. చేనేత వస్త్రాలైన కుప్పడం చీరల ఉత్పత్తులు, అమ్మకాలు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై కేంద్ర బృందానికి నివేదిక అందించడంతోపాటు కలెక్టర్ చక్కగా వివరించారు. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. చేనేతల కష్టాలు తీరనున్నాయి.
పొగాకు కొనుగోలు : ..
బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో బాపట్ల జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. చీరాల, పర్చూరు, జెపంగులూరు, ఇంకొల్లు మండలాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రయోజనం పొందేలా ప్రభుత్వ నిర్ణయాన్ని రైతుల వద్దకు చేరుస్తున్నారు. ప్రతి కేంద్రంలో కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పూర్తిస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు :..
వసతి గృహాల విద్యార్థుల కష్టాలు తెలుసుకున్న కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించారు. జిల్లాలో ఎస్సీ,బీసీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కలెక్టర్ వెంకట మురళి దృష్టి సారించారు. పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడానికి డిస్టిక్ మినరల్ ఫండ్ కేటాయించారు. 68 ఎస్సీ, ఎస్టీ,బీసీ హాస్టల్స్ తో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలోనూ విద్యార్థుల మౌలిక అవసరాల కొరకు రూ. ఒక కోటి 18 లక్షలు నిధులు ఇచ్చారు. హాస్టల్స్ మరమ్మతుల కొరకు మరో కోటి 76 లక్షలు నిధులు కేటాయించారు. విద్యార్థుల సౌకర్యం కోసం ప్రతి హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్, గీజర్, కుర్చీలు, ఇచ్చారు. విద్యార్థుల సంరక్షణ కొరకు ఒక్కొక్క వసతి గృహానికి ఎనిమిది చొప్పున సీసీ కెమెరాల టీవీలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు :…
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం గురి కాకుండా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ సిబ్బందితో సర్వే నిర్వహించారు. గుర్తించిన ప్రభుత్వ భూములకు రక్షణ చర్యలు చేపట్టారు.
అనాధ శిశువులకు అండగా :…
అనాధ శిశువులకు ఆశ్రయం కల్పించే శిశు గృహంను కలెక్టర్ సందర్శించారు. వారి బాగోగులు చూసుకోవాలని సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. వారిని తన తన బిడ్డలుగా భావిస్తున్నాను అంటూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు కలెక్టర్. తద్వారా నిరంతరం ఆయన పర్యవేక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు