విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు బొగ్గుల తిక్కన్న
విశాలాంధ్ర – పెద్దకడబూరు : క్లస్టర్ ఇంచార్జీని ఎమ్మెల్సీగా చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని టీడీపీ నాయకులు బొగ్గుల తిక్కన్న కొనియాడారు . బుధవారం పెద్దకడబూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వడ్డెర, దళిత వర్గ నేతలకు ఎమ్మెల్సీ పదవులు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కోసం ఎన్నో ఏళ్లుగా అంకిత భావంతో పని చేస్తూ, క్లస్టర్ ఇంచార్జీగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం సామాన్య కార్యకర్తలకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేతగా ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి నిస్వార్ధ సేవలందిస్తూ పార్టీ తరపున ప్రజా సమస్యలపై నిరంతరం తన గళాన్ని వినిపించిన దళిత నాయకుడు వర్ల రామయ్యను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం సామాజిక న్యాయానికి టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లో కాకుండా పదవులు, అవకాశాలు, ప్రాధాన్యత రూపంలో ఆచరణ చూపిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ అన్ని వర్గాలకు సముచిత గౌరవం, సమాన అవకాశాలు కల్పిస్తూ సామాజిక న్యాయం సాధించే దిశగా టీడీపీ మరింత ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.


