Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలి

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలి

- Advertisement -

-కరువు కరాళ నృత్యం చేస్తున్నా పాలకులకు పట్టదా..?
-అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
-రైతులపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం
-రాప్తాడులో ఎండిన పంటల పరిశీలనలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని..జిల్లాల్లో కరువు
కరాళ నృత్యం చేస్తున్నా ప్రభుత్వానికి, పాలకులకు చీమకుట్టినట్లైనా లేదని..రైతన్నలంటే అంత చిన్నచూపు ఎందుకని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో వర్షాభావంతో ఎండిపోయిన చీనీ, కంది, వేరుశనగ పంటలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు డి.జగదీష్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సి.జాఫర్, జిల్లా కార్యదర్శి పి.నారాయణస్వామి, సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా రాప్తాడు గ్రామానికి చెందిన కౌలు రైతు పామల్ల ఎర్రిస్వామి సాగు చేసిన వేరుశెనగ పంటను చూసి చలించిపోయారు. పెట్టుబడి ఎంత ఖర్చు అయిందని అడగగా సాగు చేసిన ఆరెకరాలకు రూ.3లక్షలు ఖర్చు అయిందన్నారు. కనీసం పశువులకు మేత కూడా చేతికందదని ఎర్రిస్వామి కన్నీటి పర్యంతమయ్యారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజనులో 3.43 హెక్టార్లలో పంటలు సాగు అంచనా వేయగా 2లక్షల 38వేల హెక్టార్లలో పంటలు పెట్టారన్నారు. అయితే ఎల్ నినో ప్రభావంతో మూడు నెలలుగా వరుణుడు ముఖం చాటేయడంతో చేసిన అరకొర పంటల సాగు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుపై రాష్ట్ర ప్రభుత్వం ఉపశమన చర్యలు నేటికీ చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసిన రైతులు లబోదిబో అనే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 300ల పైచిలుకు మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, రైతులు, ప్రజలను ఆదుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని
ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జాతీయ విపత్తుగా ప్రకటించడమే కాకుండా, ఇక్కడున్న గ్రామీణ పేద ప్రజలను, రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని చర్యలు కూడా చేపట్టాలని కోరుతున్నామన్నారు. వర్షాభావంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులు, ప్రజల వలసలు ప్రారంభమయ్యాయని.. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 20 రోజుల క్రితం కరువు గురించి ఒక మాట మాట్లాడాడు తప్ప, మళ్లీ దాని గురించి ప్రస్తావన చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్థితులు ఉంటే సీఎం అధ్యక్షతన జరిగిన రెండు రోజుల కలెక్టర్ల మీటింగ్ లో ఈ అజెండా లేకపోవడం చూస్తే రైతులపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. కనీసం ఒక అర్ధగంట దీనికోసం కేటాయించి కూడా మీరు చర్చించలేదంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా పండ్ల తోటల రైతులు రూ. లక్షలు వెచ్చించి కంటికి రెప్పలా కాపాడుకున్నా.. తీరా పంట చేతికి వచ్చేటప్పుడు వర్షాలు కాకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. బోరుబావుల్లో నీళ్లు దొరకని ఫలితంగా తోటలన్నీ ఎండుముఖం పట్టాయన్నారు. కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేసి పంటలు సాగు చేస్తే ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. చాలా చోట్ల పశువులకు పశుగ్రాస కొరత వల్ల కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడింది. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మూడు రోజుల పాటు సీపీఐ ఆధ్వర్యంలో జిల్లాలన్నీ తిరిగి ఈ కరువు సమాచారం కూడా సేకరించి, ఈనెల 15, 16తేదీల్లోగా అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెవెన్యూ మంత్రిని కూడా కలిసి సమస్యలను వివరిస్తామన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కదలిరావాలి, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. లేనిపక్షంలో మా ఉద్యమం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో కూడా సంబంధిత మంత్రులను కలిసి ఈ అంశాన్ని వారి దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి వర్గసభ్యులు రామకృష్ణ, కేశవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.నాగరాజు, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్.
ఏఐవైఎఫ్ నాయకుడు జి. దుర్గాప్రసాద్, రాప్తాడు మండలం సహాయ కార్యదర్శి ఎం.చలపతి, రెడ్డప్ప, కుళ్లాయప్ప, ప్రసాద్, విజయకుమార్, నాగేష్, నరేంద్ర, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు