అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన ఉన్మాది హేమంత్ ఆరోగ్యంపై వివరాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో గాయపడిన హేమంత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్‌రేలో బుల్లెట్లు కనిపించలేదన్నారు. కుడి కాలుకు తీవ్ర గాయమైందని.. దీంతో రక్తప్రసరణ జరగక ఆ కాలు కుళ్లిపోయిందని చెప్పారు. కాలు సగ భాగం తొలగించే పరిస్థితి రావచ్చని మల్లీశ్వరి చెప్పారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అనస్తీషియా వైద్యుడు పరిశీలిస్తున్నారన్నారు. ఎక్స్‌రే రిపోర్టు, అనస్తీషియా వైద్యుడి నివేదిక పరిశీలించాక కాలు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
రంపం దాడి ఉన్మాదిపై పోలీసుల కాల్పులు
రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పదోతరగతి విద్యార్థిని గోపికపై రంపంతో దాడిచేసిన ఉన్మాది హేమంత్‌పై పోలీసుల బృందం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు అడవిలో అతడిని పట్టుకునే క్రమంలో సీఐ వెంకటేశ్‌పై నిందితుడు దాడికి యత్నించడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఎదురుదాడి చేయడంతో హేమంత్ కాళ్లపై కాల్చారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పోలీసులు అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు.


