Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలి .. అధికార పక్షం దాడులను హైకోర్టు సుమోటో...

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను చర్యలు తీసుకోవాలి .. అధికార పక్షం దాడులను హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించాలి.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం: దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునీత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనపై రాష్ట్ర హైకోర్టు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను, కరువు పరిస్థితులు, విజయదశమి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు నిర్వహించారని జగదీష్‌ ఆరోపించారు. గతంలో కరోనా సమయంలో ఎన్నికలను వాయిదా వేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం పరిస్థితులు సరిగా లేనప్పటికీ ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోకుండా వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని విమర్శించారు.జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కోట్లాది మంది ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ ఎన్నికల కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీతో సిపిఐ సీట్ల సర్దుబాటు చేసుకుందని జగదీష్‌ తెలిపారు. కూటమి అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా సిపిఐ పనిచేసిందన్నారు. బీజేపీ మేయర్‌ అభ్యర్థిని ఓడించేందుకు సిపిఐ విశేష కృషి చేసిందని, నగరంలోని మసీదుల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించామని చెప్పారు. సిపిఐ మూడు చోట్ల పోటీ చేసినప్పటికీ, టీడీపీ నాయకులు భారీగా డబ్బులు పంపిణీ చేయడంతో తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని ఆరోపించారు. సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడబోవని స్పష్టం చేశారు.బీజేపీ మేయర్‌ అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు అనంతపురంలో మకాం వేసినా ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థికి రెండు కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని ఆరోపించారు. అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు, ప్రజలు ఐక్యంగా నిలిచి బీజేపీని ఓడించారని, ఆ పార్టీ ఓటమిని అంగీకరించాలని అన్నారు.11వ డివిజన్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి తన అనుచరులతో వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని జగదీష్‌ ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్‌పై పోలీసులు లాఠీచార్జి చేయించారని తెలిపారు. బీజేపీ అభ్యర్థి అజయ్‌ తండ్రి తమ పార్టీలో ఉండేవారని, బీజేపీ తరఫున ప్రచారం చేసినందుకు ఆయనను పార్టీ నుంచి తొలగించామని చెప్పారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన సిపిఐకి వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలపకపోవడం బాధాకరమన్నారు. మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా వైసీపీ, సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీలను కలుపుకొని ఉద్యమిస్తామని తెలిపారు.

పోలీసుల పాశవిక దాడి: జాఫర్‌

తమపై పోలీసులు పాశవికంగా దాడికి తెగబడ్డారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్‌ ఆరోపించారు. ఈ దాడిలో తనతోపాటు కార్యకర్త బషీర్‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులపై కేసు పెడతామని చెప్పారు. అనంతపురం నగరంలోని 11వ డివిజన్‌ కస్తూరిబా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు సజావుగా జరిగాయని జాఫర్‌ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత నాలుగైదు వాహనాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి తన అనుచరులతో వచ్చారని, సుమారు 50 మంది లోపలికి వెళ్లారని ఆరోపించారు. వారు రిగ్గింగ్‌కు ప్రయత్నించగా ఏజెంట్లు అడ్డుకున్నారని పేర్కొన్నారు.అనంతరం తమ కార్యకర్తలు కూడా లోపలికి వెళ్లారని, ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు దాడికి ప్రయత్నించారని తెలిపారు. ఐదు నిమిషాల తర్వాత వచ్చిన పోలీసు బెటాలియన్‌ తమపై, కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేసిందని ఆరోపించారు. ఎవరి అనుమతితో లాఠీచార్జి చేశారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, టీడీపీ నాయకులు పోలీసు బెటాలియన్‌ను నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు సజావుగా జరిపించడంలో కలెక్టర్‌, ఎస్పీ విపలం

నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని గతంలోనే అధికారులను కోరామని గుర్తుచేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి కోరారు. తాడిపత్రిలో 30 వార్డుల్లో నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరినా, అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.తమ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదని, దౌర్జన్యాలు, బెదిరింపులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్‌గౌడ్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి.కె.కృష్ణుడు, కల్లుగీత కార్మిక సంఘం నాయకుడు నాగేష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు