–తక్షణమే 30 శాతం ఐఆర్ ప్రకటించాలి : ఎస్టీయూ
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 200 ద్వారా 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే కమిటీకి ఏడాది కాలపరిమితి విధించడం వల్ల పీఆర్సీ ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి యు.రామాంజినేయులు అన్నారు. గురువారం స్థానిక ఎంపీపీఎస్ మెయిన్ పాఠశాలలో ఎస్టీయూ మండల అధ్యక్షుడు పి.ఉరుకుందు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజినేయులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీఆర్సీ నివేదిక సమర్పణకు నిర్దేశించిన ఏడాది కాలపరిమితిని ఆరు నెలలకు కుదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలు, ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని కోరారు. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు ఐఆర్ ఎంతో అవసరమన్నారు. ఈ సమావేశంలో ఎస్టీయూ మాజీ అసోసియేట్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప, జిల్లా కౌన్సిలర్లు యు.లక్ష్మీపతి, బి.జ్యోతిమూర్తి, బి.తిమ్మప్ప, ఎస్టీయూ నాయకులు కె.రామాంజినేయులు, కె.బాబా, జి.విజయరూపిని, ఎస్.ఫర్హానా తదితరులు పాల్గొన్నారు.


