మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలం
లైంగిక వేధింపులు కేవలం మాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయన్న రాధిక
మాలీవుడ్‌లో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు తీవ్ర కలకలాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ నివేదిక మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై షాకింగ్ విషయాలు వెల్లడించింది. దాంతో ఈ రిపోర్ట్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణాది సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు రాధికా శరత్‌కుమార్ తాజాగా లైంగిక వేధింపులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయన్నారు. హీరోయిన్లు, నటీమణులు దుస్తులు మార్చుకునే సినిమా సెట్‌లలోని కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టేవారని ఆమె ఆరోపించారు. రాధిక ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. మహిళా నటులు బట్టలు మార్చుకునే కారవాన్లలో రహస్య కెమెరాలు ఉన్నట్లు గుర్తించినప్పుడు తాను ప్రతిఘటించానని తెలిపారు.ఇలా కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ ఘటన తర్వాత నుంచి తాను ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదని అన్నారు. ఒకవేళ బట్టలు మార్చుకోవలసి వస్తే తాను బస చేసే హోటల్ గదికి తిరిగి వచ్చేదానినని రాధిక చెప్పారు. వమలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు మహిళా నటులు.. ప్రముఖ వ్యక్తులు తమ హోటల్ గదులకు వచ్చి తలుపులు ఎలా కొడతారో నాకు చెప్పారు. కొందరు నా సహాయం కూడా కోరారువ అని ఆమె అన్నారు.ఇదిలాఉంటే.. తమిళ సినీ పరిశ్రమలో ఏవైనా చేదు అనుభవాలు ఎదురైతే మహిళా కళాకారులు బయటకు రావాలని నటుడు, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎస్ఐఏఏ) ప్రధాన కార్యదర్శి విశాల్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తమిళ నటి, జాతీయ అవార్డు గ్రహీత కుట్టి పద్మిని తన పదేళ్ల వయసులోనే తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురయ్యారని తాజాగా ఆరోపించారు. ఈ విషయమై తన తల్లి ప్రశ్నించగా తనను సినిమా నుంచి తప్పించారని ఆమె చెప్పారు.