: ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : ప్రతిరోజు ప్రజలంతా అరగంట పాటు ఆరోగ్యం, ఫిట్నెస్ లేదా ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనేలా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డి.ఎస్.డి.ఓ షఫీ, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజని, ఆయన క్రీడలకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆగస్టు 29వ తేదీ నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి 5కే రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈరోజు సాయంత్రం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయ, ఇంకా పైస్థాయికి వెళ్లినటువంటి క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ లేదా ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగు వారిని ఫిట్ గా ఉండేలా ప్రోత్సహించాలన్నారు. ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ను, ఫిట్నెస్ అసెస్మెంట్ పరీక్షను క్రమం తప్పకుండా అనుసరించాలన్నారు. అంతకుముందు డిస్టిక్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం అధికారులు, డిఎంహెచ్ఓ కార్యాలయం అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.