విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ దేశ వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ , సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ప్రజా పంపిణీ ద్వారా 14 రకాల నిత్యవసర సరుకులను ప్రజలకు ఇవ్వాలన్నారు. రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు ఏమి తినేతట్లు లేదని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామంటూ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు దాటినప్పటికీ కూడా అమలు నోచుకోలేదన్నారు. మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో కూడా కేవలం రేషన్ బియ్యం తప్ప నిత్యావసర సరుకులు ఏ ఒక్కటి కూడా ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు. ఈ విషయంపై 6వ తారీఖున కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారన్నారు. కావున ప్రజలందరూ కూడా రైతులందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిడ్డయ్య, మహమ్మద్, హుసే, లక్ష్మన్న, ఉరుకుందు, వెంకటేశు, నారాయణ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.