Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

‘పెట్రో’ దోపిడీ..?

ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా పెట్రోల్‌, డీజిల్‌
జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ఊసే లేదు
ఆ డిమాండ్‌ను నిరాకరిస్తున్నమోదీ సర్కార్‌
భారీ ఆదాయం కోసం ప్రజల నడ్డివిరుస్తున్న వైనం

న్యూదిల్లీ : మోదీ సర్కార్‌ ప్రజల నడ్డివిరచడమే పనిగా పెట్టుకుంది. పెట్రో ఉత్పత్తులపై పన్నుల మాటున యదేచ్ఛ దోపిడీకి పాల్పడుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా నిత్యావసరమైన పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా పన్నులు విధించింది. ఆ భారం మోయలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతేకా కుండా పెట్రో ధరలు ఇతర రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రభుత్వానికి మాత్రం భారీ ఆదాయం సమకూరుతోంది. కొన్ని నెలలుగా రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పటికే చితికిపోయిన ప్రజల బతుకులను పాలకులు మరింత ఛిద్రం చేశారు. ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. గతవారం జరిగిన సమావేశం పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకూడదని నిర్ణయించింది. కేరళ హైకోర్టు ఆదేశం తర్వాత దేశీయ ఇంధనాలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనను కౌన్సిల్‌ చేపట్టింది. కానీ దానిని కౌన్సిల్‌ సభ్యులు తిరస్కరించారు. పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలను నియంత్రించడానికి ఇంధన ధరలపై పన్నులు తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడమే దేశీయ ఇంధన ధరల పెరుగుదలకు కారణమని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. భారతదేశం 80 శాతం కంటే ఎక్కువ చమురు సరఫరాలను దిగుమతి చేసుకుంటుంది. ఇంధన ధరల పెరుగుదల వెనుక అధిక పన్నులు ఒక ప్రధాన కారణం. వినియోగదారుడు ఇంధనాలను కొనుగోలు చేయడానికి చెల్లించిన డబ్బులో సగానికి పైగా పన్నులు చెల్లింపునకే వెళుతుందన్న విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ప్రభుత్వం దేశీయ ఇంధన ధరల తగ్గింపు ఊసే ఎత్తడం లేదు. అందుకు బదులుగా చమురు కంపెనీలకు ఊహించని రీతిలో వచ్చే లాభాలు చేజిక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచుతోంది. ఉదాహరణకు..ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో డిమాండ్‌ భారీగా పడిపోయిన కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్లకు పడిపోయినప్పటికీ భారతదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధర అధికంగానే ఉంది. ఇతర ఆదాయాల నష్టాన్ని భర్తీ చేయడానికి దేశీయ ఇంధనాలపై పన్నులు పెంచినట్లు స్వయానా ప్రభుత్వమే అంగీకరించడం విశేషం. ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించడానికి వాటిపై పన్నులు తగ్గించాలని సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష పార్టీలు పెద్ద పెట్టున ఉద్యమిస్తున్నాయి. దీనికి ఇతర ప్రతిపక్ష పార్టీలూ గొంతు కలిపాయి.
కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది..?
దేశంలో అత్యధికంగా పన్ను విధించబడిన రెండు వస్తువులు పెట్రోల్‌, డీజిల్‌. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. 2020-21లో కేంద్ర, రాష్ట్ర ఖజానాకు ఇంధన పన్నుల ద్వారా 6 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని అంచనా. దేశీయ ఇంధనాలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం అంటే వాటిపై పన్నులు తగ్గించడమే. అయితే జీఎస్‌టీ కింద అత్యధిక పన్ను స్లాబ్‌ 28 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాలపై 100 శాతానికి పైగా పన్ను విధించి ప్రజల నడ్డివిరిచింది. ఇదిలాఉండగా, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు తగ్గించడానికి ఇష్టపడవు. ముఖ్యంగా రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వలన తమ పన్నుల వాటాను స్వీకరించడానికి కేంద్రంపై మరింత ఆధారపడవలసి ఉంటుందని భావిస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రాలు స్వతంత్రంగా పెట్రోల్‌, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను విధించవచ్చు. సేకరించిన ఆదాయం సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని చెప్పడం ద్వారా కేంద్రం, రాష్ట్రాలు ఇంధనాలపై భారీగా పన్ను విధించాలనే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయి. మరోవైపు, దేశీయ ఇంధనాలపై అధిక పన్నులు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. అధిక పన్నులు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తాయన్న వాదనలు పెద్దపెట్టున వినిపిస్తున్నాయి. పన్నులు తగ్గిస్తే, పెట్రోల్‌, డీజిల్‌ మరింత సరఫరా అవుతుందని, ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని పేర్కొంటున్నారు. పన్ను రేట్ల తగ్గింపు కంటే ఆర్థికవృద్ధికి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటే, ప్రభుత్వం ప్రస్తుత అధిక ఇంధన పన్ను పాలన కంటే వాస్తవానికి ఎక్కువ ఆదాయాన్ని సేకరించవచ్చు.
పెట్రోల్‌, డీజిల్‌పై తక్కువ పన్ను ద్వారా కేంద్ర, రాష్ట్రాల ఆదాయాలు భారీగా ప్రభావితమవుతాయి. అందువల్ల ఈ ఇంధనాలు త్వరలో జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ పన్ను ఆదాయంలో ఎలాంటి నష్టాన్ని నివారించడానికైనా వాటిపై తీవ్రమైన జీఎస్‌టీ రేటు విధించే అవకాశం ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది అసలు ప్రశ్న కాదు. కానీ పాలకులు నిజంగా ఇంధనాలపై పన్నులు తగ్గించాలని కోరుకుంటున్నారా అనేది ముఖ్యం. పన్నుల వైపు వెళ్లే పెట్రోల్‌ తుది ధర వాటా 2014లో దాదాపు 30 శాతం నుండి ఇప్పుడు 55 శాతానికి పెరిగిందన్నది గమనించాల్సిన విషయం. ఏదిఏమైనా ఇంధన ధరలు పెరగకపోవడమే వినియోగదారులు ఆశించే ఉత్తమమైన అంశం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img