డా. ఎన్. ఈశ్వర రెడ్డి
నా పవిత్ర దేశంలో
నిర్భయ చట్టాలు… న్యాయ సంహితలు
అక్క చెల్లెళ్ళపై అత్యాచారాలను
ఆపలేక పోతున్నాయి
నా పుణ్యభూమిలో
క్రమశిక్షణ కలిగిన పోలీసులు…ఎత్తైన గోడలున్న జైళ్ళు
యువతుల హత్యలను నిలువరించలేక పోతున్నాయి.
మొన్నేమో ఢల్లీిలో నిర్భయ
నిన్నేమో హైదరాబాద్‌లో దిశ
నేడేమో కొలకత్తాలో డాక్టరమ్మ!
ఇక్కడ
నాయక గణాలు బాధితులను గాలికొదిలి
బలవంతుల తక్కెట్లో కూర్చుంటారు.
భౌగోళిక పరిధిని తమ రాజ్యంగా చేసుకొని
మహారాజ గిరి వెలగబెడతారు.
అధికారుల రెక్కలు నరికి
స్వీయ శాసనాలు రాసుకుంటారు.
కాళ్లకు సంకెళ్లు తగిలించుకున్న చట్టాలు
అమాత్యుల కనుసన్నల పంజరాల్లో చిక్కి
బేలగా దిక్కులు చూస్తుంటాయి.
కళ్ళముందే నేరం జరుగుతున్నా…
నేరగాడు ఎదురుపడి వెక్కిరిస్తున్నా…
అధినాయకుడి ఆదేశం కోసం దేబురిస్తుంటాయి.
ఎవరిని పట్టుకోవాలో…ఎవరిని వదిలెయ్యాలో
సింహాసన భల్లూకం నిర్ణయించాక
ఆపరేషన్ హరిశ్చంద్ర ప్రారంభిస్తుంటాయి.
I I I
క్రూర మృగాలు జింక పిల్లను నమిలేసినట్టు
గుంట నక్కలు కుందేలు కూనను చీల్చుకు తిన్నట్టు
పైచాచిక మానవ గొడ్లు ఆ డాక్టరమ్మ దేహంపై పడి
శరీరాన్ని రక్తపుముద్ద చేసి నంజుకు తిన్నాయి.
క్షత గాత్రుల గాయాలకు ఊరట నిచ్చిన డాక్టరమ్మ దేహం
ఈ పిచ్చి కుక్కల దాడిలో
ప్రవహించే నెత్తుటి కాలువలైంది.
జననేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనే తేడా లేకుండా
ఉబికే రక్తపు చలమలయ్యింది.
విరిగిన ఎముకలు
కమిలిన గొంతు
చీల్చబడ్డ శరీరం
ఆమె అనుభవించిన భయానక నరకానికి
సాక్ష్యమిచ్చే ప్రత్యక్ష ఆనవాళ్ళు.
ఇప్పుడు కొవ్వొత్తుల ప్రదర్శన సరిపోదు
ఆ దుర్మార్గుల కొవ్వును కాల్చే కాగడాలు అవ్వాలి.
ఇప్పుడు నిరసనలు… నిరాహారదీక్షలు సరిపోవు
ఆ నేరగాళ్ల నరాలు తెంపే పిడిబాకులుగా మారాలి.
ఇప్పుడు బందులు… హర్తాళ్‌లు అస్సలు సరిపోవు
ఆ నరహంతకులను నడిరోడ్డుపై నిలబెట్టి
మర్మావయాలను తెగ్గోసే కరవాలాలుగా మారాలి.
మీరిచ్చే తీర్పు చూసి
మృగాళ్ళ గుండెలు నీళ్లై పోవాలి.
జన్మ జన్మలకు గుర్తుండిపోయే
శిక్షా పాఠంగా నిలవాలి.
(కలకత్తా నగరంలో పీజీ డాక్టరమ్మపై జరిగిన
దారుణ అత్యాచారం, హత్యకు నిరసనగా)