Monday, February 6, 2023
Monday, February 6, 2023

బాధితులకు సత్వర సాయం

అధికారులు డైనమిక్‌గా పనిచేయాలి
జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారి
ప్రభుత్వ ఉద్యోగుల మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు
వరదలు, వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, అధికారులంతా డైనమిక్‌గా పనిచేస్తూ సత్వర సాయమందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో సీఎం జగన్‌ సోమవారం సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలని, 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంప, రూ.2వేలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకుని, వలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందించాలని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరి హారం వెళ్లాలని, ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడద న్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని, వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానీయకూడదని చెప్పారు. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలని, వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి, దీనిమీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 104 కాల్‌సెంటర్‌ ఇప్పటికే ప్రజలందరికీ పరిచయం ఉందని, ఆ నంబరుకు విస్తృత ప్రచారం కల్పిం చాలని, వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ సమాచారం ఇవ్వాలని చెప్పాలన్నారు. జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపైన, రోడ్లను పునరుద్ధ రించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాలని చెప్పారు. శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొం దించాలని, ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలన్నారు. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బ తిన్నా.. వారికి వెంటనే నగదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100, దీంతోపాటు ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలని, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200 నగదు వెంటనే అందించేలా చూడాలని సూచించారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలని, నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి రూ.25లక్షల చొప్పున సాయమం దించాలని పేర్కొన్నారు. మరణించిన పశువుల కళేబరాల వల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వాటి ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలని, వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోవాలన్నారు. పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలు పెట్టాలని, విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. చెరువులు, ఇతర జలాశయాలు, కట్టల మీద దృష్టిపెట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నామని ప్రకటించారు. విద్యుత్‌ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్‌స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపు లేని ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, జల వనరులశాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఆర్‌అండ్‌బి ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ కమిషనర్‌ కె.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img