Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

మోదీని భయపెడ్తున్న డాక్యుమెంటరీ

గుజరాత్‌ మారణకాండపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ బీజేపీకి, మోదీ సర్కారుకు నచ్చి ఉండకపోవచ్చు. అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. కానీ ఈ డాక్యుమెంటరీ ప్రస్తావన తీసుకొచ్చిన ట్విట్టర్‌ ఖాతాలలో ఈ నిషేధించడం లేదా అడ్డుకోవడం కచ్చితంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగించడమే. అవకాశం దొరికిన వారు ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే చూసేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే రెండో భాగం విడుదలైంది. అయితే రెండో భాగం మన దేశంలో విడుదల చేయలేదు. కానీ ఇంటర్నెట్‌ యుగంలో సమాచార ప్రసారానికి హద్దులు చెరిగిపోయాయి. అందువల్ల రెండో భాగాన్ని చూశామంటున్న వారూ ఉన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పత్రికలమీద సెన్సార్షిప్‌ విధించినందుకు తీవ్రంగా దుయ్యబట్టిన సైద్ధాంతిక పునాదికి చెందినవారే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇందిరా గాంధీ సెన్సార్షిప్‌ విధించడం తప్పయితే ఇప్పుడు బిబిసీ డాక్యుమెంటరీని అడ్డుకోవాలనుకోవడం ఒప్పెలా అవుతుందో! ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు కత్తెర వేయడమే. ఇరవైఏళ్ల నాటి గుజరాత్‌ మారణకాండను ఇప్పుడు ఎందుకు రేకిత్తుస్తున్నారు అని వాదించే వారూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చరిత్ర పుటలను తిరగేయడం మానవ నైజం. గుజరాత్‌ మారణకాండ మీద విమర్శలు కొత్త కాదు. ఆ మారణకాండ సెగ కొద్దిగా తగ్గిన తరవాత అనేక మంది మాజీ న్యాయ మూర్తులు అక్కడ పర్యటించి నివేదికలిచ్చారు. అందులో న్యాయమూర్తి పి.బి.సావంత్‌ను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. రచయితలు, మేధావులు కూడా ఇదే రకమైన నివేదికలు విడుదలచేసి గుజరాత్‌ మారణకాండను ఈసడిరచడమే కాదు శక్తి మేరకు ఖండిరచారు. అప్పుడు మోదీయే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. మారణకాండ తరవాత అభివృద్ధి రాగం ఆలపించి మోదీ పునీతుడిని కావాలని ప్రయత్నించి ఉండవచ్చు. 2014లో ప్రధానమంత్రి అయిన తరవాత ఆయన హిందుత్వ విధానాలు మరింత పదునెక్కాయి. హిందుత్వ రాజకీయాల్లో అంతకు ముందు నర్మగర్భంగా మాత్రమే ఉన్న విద్వేష ప్రచారం మోదీ హయాంలో విచ్చలవిడిగా కొనసాగుతోంది. మూక దాడులు, ముస్లింలను పరాయివారిగా చూడడం వికృత రూపం దాల్చింది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్నవారు, సీనియర్‌ బీజేపీ నాయకులే ముస్లింల మీద బహిరంగంగా విషం చిమ్ముతున్నారు. అలాంటి వారి మీద చర్య తీసుకున్న దాఖలాలు లేవు. గుజరాత్‌ మారణకాండవల్ల కావచ్చు లేదా ముఖ్యమంత్రిగా. తరవాత ప్రధానమంత్రిగా మోదీ నడవడిక ఆయనను హిందూ హృదయ సామ్రాట్‌ కావడానికి దోహదంచేసి ఉండవచ్చు. హిందువులలో అభద్రతాభావం బలపడేట్టుచేసి హిందువులను సంఘటితం చేయడానికి మోదీ ప్రయత్నాలలో దాపరికం ఏమీ లేదు. బిబిసి డాక్యుమెంటరీవల్ల కొత్తగా మోదీ ప్రతిష్ఠకు కలిగే లోటేమీ ఉండదు. అయన హిందువుల పరిరక్షకుడని భావించేవారు ఎటూ ఉండనే ఉన్నారు. అదేరీతిలో ఆయన మతతత్వ రాజకీయాలను తూర్పారబట్టేవారూ ఉన్నారు. ఈ డాక్యుమెంటరీవల్ల మోదీ ప్రతిష్ఠ పెరగడమో, తగ్గడమో అనే ప్రశ్నే లేదు. అయినా మోదీ ప్రభుత్వాన్ని ఏదో భయం పీడిస్తోంది. ఈ డాక్యుమెంటరీని నిషేధించినందువల్ల వ్యతిరేక ప్రచారం ఆగుతుందనుకోవడం భ్రమ. దేశంలో ఆయనకు అనుకూలురు ఉన్నట్టే వ్యతిరేకులూ ఉన్నారు. మోదీ స్వదేశంలో హిందువుల పరిరక్షకుడి రూపంలో ఉంటారు. విదేశాల్లో సెక్యులర్‌ వాదిగా చెలామణి కావడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆయన నడవడికలో ఓ ద్వైదీభావం ఉంది. ఈ కారణంగానే బిబిసి డాక్యుమెంటరీ మోదీని కలవర పెడ్తోంది. గుజరాత్‌ మారణకాండ విషయంలో సుప్రీంకోర్టు మోదీని నిర్దోషిగా తేల్చిన మాట నిజమే. ఆ తరవాత ఆయన విరోధులకు ఆయన మీద ఉన్న అభిప్రాయం మారలేదు. అలాగే సమర్థకుల సంఖ్యా తగ్గలేదు. అయినా ఆందోళన పడ్తున్నారంటే ఆయన సమర్థ పాలకుడి దశనుంచి, అభివృద్ధి సాధించడంలో అగ్రగామి అనిపించుకోవడం నుంచి ఇప్పుడు రాజనీతిజ్ఞుడిని అనిపించుకోవాలని తెగ తాపత్రయ పడ్తున్నారు. ఈ డాక్యుమెంటరీ దానికి అవాంతరం కల్గిస్తుందని భయపడ్తున్నారు. అందుకే ఆయన అనుచరగణంలోని వారు అవసరమైన దానికన్నా ఎక్కువగా స్పందిస్తున్నారు. సాధారణంగా ఏ గ్రంథాన్నో, సినిమానో, డాక్యుమెంటరీనో, ఒక కళాఖండాన్నో నిషేధించినప్పుడు ప్రభుత్వం వాటిని చదివి చూసి, పరిశీలించి, నిగ్గు తేల్చి నిర్ణయం తీసుకోదు. దాన్ని వ్యతిరేకించే వారూ ఇదే పని చేస్తారు. ఇప్పుడూ అదే జరుగుతోంది.
ఈ ధోరణివల్లే ఎక్కడ చిన్న ఆకు కదిలినా మోదీ సర్కారు అతిగా స్పందిస్తోంది. నిన్న సాయంత్రం జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.యు.) విద్యార్థులు ఉమ్మడిగా బిబిసి డాక్యుమెంటరీ చూడాలను కున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆజ్ఞానుసారం కావచ్చు ఆ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ అతిగా ప్రవర్తించారు. జె.ఎన్‌.యు.లో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరా తొలగించారు. మోదీ నిరంతరం డిజిటలీకరణ మంత్రం జపిస్తున్న దశలో కూడా జె.ఎన్‌.యు. వైస్‌ చాన్సలర్‌ లాంటి వారికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసినందువల్ల, యూనివర్సిటీలో అంతర్జాల సదుపాయం తొలగించినందువల్ల విద్యార్థులు తమ మొబైల్‌ ఫోన్లలోఈ డాక్యుమెంటరీ చూసే అవకాశం మిగిలే ఉందని ఆలోచించలేదు. జామియా మిలియాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ పోలీసులు ప్రవేశించారు. విద్యార్థుల మీద బలప్రయోగం చేశారు. కొంతమంది విద్యార్థులను అరెస్టు కూడా చేశారు. దీన్నిబట్టి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని రుజువు కావడంతప్ప మరే ఫలితమూ ఉండదు. మోదీ సర్కారు పెదవి విప్పితే ప్రజాస్వామ్య మంత్ర జపమే చేస్తుంది. కానీ ఆయన ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను పొరపాటున కూడా అనుసరించదు. డాక్యుమెంటరీలో అసత్యాలు ఉన్నాయనుకుంటే వాటిని బయటపెట్టవచ్చు. అసత్య ప్రచారం చేసినందుకు బిబిసిని నిలదీయవచ్చు. ఇవేవీ చేయకుండా నిషేధాస్త్రం ప్రయోగిస్తున్నారు. నిషేధం ఉన్న ప్రతి అంశం మీద జనం ఆసక్తి మరింత పెరుగుతుంది. దొంగచాటుగా ఈ డాక్యుమెంటరీ చూసే ప్రయత్నం ముమ్మరం అవుతుంది. దీన్ని ఆపడం ఏ ప్రభుత్వ తరమూ కాదు. విద్వేష ప్రచారానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, తమకు వ్యతిరేకులనుకుంటున్న వారి భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుతగలడం మోదీ సర్కారులాంటి వారికి మామూలే.
గుజరాత్‌ మారణకాండ విషయంలోగానీ, విద్వేష ప్రచారం విషయంలోగానీ సంఫ్‌ు పరివార్‌ కూటమికి సర్వ వ్యవస్థలూ అండగానే నిలుస్తున్నాయి. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు. ఈ డాక్యుమెంటరీని నిషేధించడం, వైస్‌ చాన్సలర్లు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం ప్రదర్శించడం మోదీ వ్యక్తిత్వాన్ని మరింత కళంకితం చేయడానికే ఉపకరిస్తుంది. ఈ డాక్యుమెంటరీ వివాదం అంతా మీడియాలోనే చర్చకు వస్తోంది తప్ప మోదీ వ్యతిరేకులు ఎక్కడా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్న జాడే లేదు. ఈ డాక్యుమెంటరీవల్ల మోదీ ప్రతిష్ఠకు భంగం ఏదైనా ఉంటే అది ఇతర దేశాల్లోనే ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం స్వదేశంలో కట్టడి చేయాలని చూస్తోంది. అంటే గాయం ఒక చోట ఉంటే మందు మరో చోట వాడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img