Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు..

పరిశుభ్ర నగరాల్లో విజయవాడ తృతీయం
వరుసగా ఐదవసారి ఇండోర్‌కు ప్రథమ స్థానం
ద్వితీయ స్థానంలో సూరత్‌.. ఏడవ స్థానంలో తిరుపతి
పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌

న్యూదిల్లీ : దేశంలోని పరిశుభ్రమైన నగరంగా ఇండోర్‌ మళ్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ వార్షిక పరిశుభ్రత అవార్డులలో ఈ నగరం వరుసగా ఐదవసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక రాష్ట్ర విభాగంలో ఛత్తీస్‌గఢ్‌ మొదటి స్థానాన్ని నిలుపుకుంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు 2021’లో ‘క్లీనెస్ట్‌ సిటీ’ విభాగంలో సూరత్‌, విజయవాడ వరుసగా ద్వితియ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ‘పరిశుభ్రమైన గంగా పట్టణం’గా గుర్తింపు పొందింది. అయితే ఈ విభాగంలో బీహార్‌కు చెందిన ముంగేర్‌, పాట్నా ద్వితియ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ‘స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ అవార్డులు 2021’లో ఇండోర్‌, సూరత్‌ తమ స్థానాలను నిలుపుకున్నప్పటికీ, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించిన తాజా సర్వే ఫలితాల్లో నవీ ముంబై తన మూడవ స్థానాన్ని విజయవాడకు కోల్పోయి నాల్గవ స్థానంలో నిలిచింది. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తదితరుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అవార్డులను అందజేశారు. తాజా దేశవ్యాప్త పరిశుభ్రత సర్వేలో 28 రోజుల్లో 4,320 నగరాలు కవర్‌ చేయబడ్డాయి. 4.2 కోట్ల మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని అందించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. వందకంటే ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలను కలిగి ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ దేశంలోని పరిశుభ్రమైన రాష్ట్రాలుగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే వందకంటే తక్కువ పట్టణ స్థానిక సంస్థలతో కూడిన రాష్ట్రాల విభాగంలో జార్ఖండ్‌ మొదటి స్థానంలో, హరియాణా, గోవా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన 10 ఉత్తమ నగరాలుగా ఇండోర్‌, సూరత్‌, విజయవాడ, నవీ ముంబై, న్యూఢల్లీి, అంబికాపూర్‌, తిరుపతి, పూణే, నోయిడా, ఉజ్జయిని ఉన్నాయి. ఇదే విభాగంలో 25 నగరాల్లో లక్నో అత్యల్ప స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని వీటా నగరం లక్ష కంటే తక్కువ జనాభాతో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ర్యాంకు సాధించింది. లోనావాలా, సస్వాద్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. న్యూఢల్లీి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఒకటి నుంచి మూడు లక్షల జనాభా కలిగిన దేశంలోని పరిశుభ్రమైన చిన్న నగరాల విభాగంలో మొదటి స్థానాన్ని పొందగా, హోషంగవాడ్‌, తిరుపతి వరుసగా ‘ఫాస్టెస్ట్‌ మూవర్‌ స్మాల్‌ సిటీ’, ’సిటిజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌లో బెస్ట్‌ స్మాల్‌ సిటీగా ఉద్భవించాయి. హోషంగాబాద్‌ (మధ్యప్రదేశ్‌) 2020 ర్యాంకింగ్స్‌లో 361వ స్థానం నుంచి 274 ర్యాంకులతో ఈ ఏడాది 87వ స్థానానికి చేరుకుంది. నోయిడా 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో దేశంలోని ‘పరిశుభ్రమైన మధ్యస్థ నగరం’గా నిలిచింది. గత ఏడాది మైసూరు ఈ అవార్డును గెలుచుకుంది. ‘సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌’ విభాగంలో ఇండోర్‌, నవీ ముంబై, నెల్లూరు, దేవాస్‌ ఉత్తమ స్థానాల్లో నిలిచాయి. అలాగే ఈ నగరం 10 నుంచి 40 లక్షల జనాభా విభాగంలో భారతదేశపు ‘పరిశుభ్రమైన పెద్ద నగరం’గా నవీ ముంబై మొదటి స్థానాన్ని పొందింది. కంటోన్మెంట్‌ బోర్డుల విభాగంలో అహ్మదాబాద్‌ పరిశుభ్రమైన నగరంగా, మీరట్‌, దిల్లీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లా ర్యాంకింగ్‌ విభాగంలో సూరత్‌ మొదటి అవార్డును కైవసం చేసుకోగా, ఇండోర్‌, న్యూఢల్లీి వరుసగా రెండు, మూడు స్థానాలను పొందాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా దేశంలోనే పరిశుభ్రమైన రాష్ట్రం అవార్డును ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ మాట్లాడుతూ ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఎందుకంటే దేశం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను జరుపుకుంటున్నదని తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో కూడా ‘సఫాయి మిత్రలు’, పారిశుధ్య కార్మికులు తమ సేవలను నిరంతరం అందించారని అన్నారు. మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) కింద సాధించిన విజయాలు అపూర్వమైన సామూహిక ప్రయత్నాల ఫలితమేనని అన్నారు. నేడు ఈ మిషన్‌ ప్రజా ఉద్యమంగా, నిజమైన ‘జన్‌ ఆందోళన’గా రూపుదిద్దుకుందని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021లో భాగంగా 91 గంగా పట్టణాల అంచనాను క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా నిర్వహించిందని, ఈ చర్య ఘాట్‌లలో, చుట్టుపక్కల పరిశుభ్రత, పారిశుద్ధ్య దినచర్యను మూల్యాంకనం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘాట్‌ల వద్ద పరిశుభ్రత స్థాయి 2020లో 62 శాతం ఉండగా, ఈ ఏడాది 72 శాతానికి పెరిగిందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img