Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

జనాభాలో సగం మంది పేదలే

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

కార్మికులు కష్టజీవులు. బక్కచిక్కిన శరీరాలలో ఎండిన కండలను మండిరచి, చెమట చుక్కలను ఆవిరి చేసి బతకడానికి మాత్రమే ఇచ్చే కూలీతో తృప్తిపడి సంపదను సృష్టిస్తారు. వీళ్ళు రోజు కూలీపై బతికే పేదలు. సంపన్నులు పరాన్నభుక్కులు. చెమట పట్టని ఎయిర్‌ కండిషన్‌ భవనాల్లో కులికే నాజూకులు. బొట్టు పని చేయ కుండా శ్రమజీవుల ఆర్జన ఆరగిస్తూ విలాసంగా బతుకుతారు. తరతరాలకు తరగని సంపదతో పెత్తనం చెలాయిస్తారు. రాజ్యాన్ని శాసిస్తారు. దేశ భవిష్యత్తునే నిర్ణయిస్తారు. సంపద సృష్టికర్తలకు` సంపదను అక్రమంగా, అశ్రమంగా భోగించే కార్పొరేట్లకు మధ్య తేడా గుర్తించని పాలనలో మనం జీవశ్చవాలలా ఉంటున్నాం. ఇలాంటి పాలనలో పేదరికం తగ్గుతుందా?
గత ఏడాది (2020) ప్రపంచ కార్మికశక్తిలో చైనా మొదటిస్థానంలో, మనం రెండోస్థానంలో ఉన్నాం. ఇండియాలో 50కోట్లమంది కార్మికులున్నారు. వీరిలో 41.49% వ్యవసాయ రంగంలో, 32.33% సేవారంగంలో, 26.18% పారిశ్రామిక రంగంలో ఉన్నారు. 3 కోట్ల వలస కార్మికులలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. మొత్తం శ్రామిక శక్తిలో 94% తోపుడు బండ్ల వ్యాపారాల వంటి అసంఘటిత రంగంలో ఉన్నారు. 6% సంఘటిత కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, ప్రైవేటు రంగాల్లో ఉన్నారు. వీరు అనేక అధికార, ప్రతిపక్ష, వామ పక్షాల, కులమతాల అనుబంధ సంఘాలలో సభ్యులు. కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదయిన కార్మిక సంఘాలు 59 వేలు. కేరళలో ఎక్కువగా 9,800 సంఘాలున్నాయి. అసంఘటిత రంగాల కార్మికుల జీతాలు తక్కువ. ఇందులో పల్లె ప్రాంతాల పనివాళ్ళ కూలీ ఇంకా తక్కువ. అసంఘటిత కార్మికుల కుటుంబ సభ్యులు అందరూ జీవితాంతం వెట్టిచాకిరీ చేస్తారు. దారిద్య్రంలో బతుకుతారు. అసంఘటిత కార్మికులకే ఎక్కువ సమస్యలు. వలస, గృహ-బానిస, బాల కార్మికుల సమస్యలు మరీ ఎక్కువ. కూడు, గూడు, గుడ్డ వంటి ప్రాథమిక జీవితావసరాలను తీర్చుకోలేని స్థితి సంపూర్ణ పేదరికం. మనిషి బతకడానికి సరిపోతుందనుకునే ఆదాయ స్థాయిని దారిద్య్ర రేఖ, దారిద్య్ర పరిమితి లేదా కూటిగీత అంటారు. సురేశ్‌ తెండూల్కర్‌ కమిటి ప్రకారం గ్రామాలలో రోజుకు మనిషికి రూ.27 లు, పట్టణాలలో రూ.33 లు ఖర్చు పెట్టలేనివారు పేదలు. రంగరాజన్‌ కమిటి గ్రామాల ఖర్చును రూ.32 లుగా, పట్టణాల ఖర్చును రూ.47 లుగా సవరించింది.
మన పేదరికం గురించి అనేక నివేదికలున్నాయి. 2009-10లో సురేశ్‌ తెండూల్కర్‌ కమిటి 29.6 శాతం అనగా 35.4 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువ ఉన్నారంది. రంగరాజన్‌ కమిటి 38.2% అనగా 45.4 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువన బతుకుతున్నారంది. 2020లో విశ్వ విత్త వేదిక ప్రకారం 22 కోట్ల మంది రోజుకు రూ.32 ల ఖర్చుతో బతుకుతున్నారు. 2021 మే నాటికి జనాభాలో 6%అంటే 8.4కోట్లమంది కడు పేదరికంలో మగ్గు తున్నారు. ఆసియా అభివృద్ధిబ్యాంకు అంచనా ప్రకారం 2014లో ఇండియాలో 6.9% జనాభా జాతీయ దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. 63% జనాభా తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. ఆక్స్‌ఫామ్‌ లెక్కల ప్రకారం 1%జనాభా దగ్గర 73% సంపద ఉంది. 50% నిరుపేదలతో సహా 67కోట్ల జనాభాఆస్తులు 1 శాతమే.
మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఏడేళ్ల నుంచి షావుకార్ల సంఖ్య, వాళ్ల ఆదాయాలు, ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. పేదల సంఖ్య, దారిద్య్రం కోలుకోలేని స్థితికి చేరాయి. పదేళ్ళలో ఎప్పుడూ లేనంత తక్కువగా మన ఆర్థిక వృద్ధి నమోదయింది. దిగజారిన ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపింది. అసమానతలు బాగా పెరిగాయి. ప్రభుత్వ లెక్కలు లేకుండానే గ్రామాల్లో పెరిగిన పేదరికాన్ని గమనించవచ్చు. నిరుద్యోగం పెరిగింది. ఇంటి ఖర్చు పడిపోయింది. సంక్షేమం-అభివృద్ధి పద్దులపై ప్రభుత్వాల ఖర్చులు పెరగలేదు. ఈ మూడు అంశాలే ఆర్థిక వ్యవస్థ స్థాయిని నిర్ణయిస్తాయి. 300 పథకాల ద్వారా 90 కోట్ల మందికి రూ.17.5 లక్షల కోట్ల నగదు బదిలీ చేశామని, ఒక్క జులై నెలలోనే రూ.6 లక్షల కోట్లు పంచామని ఆగస్టు 2 న ప్రధాని చెప్పారు. ఇదే నిజమైతే పేదరికం తగ్గకపోగా ఎందుకు పెరిగింది?
గ్రామీణ ప్రాంతాలలో నిలకడలేని పనులు చేసే కూలీలు, పేదలు ఒకటిన్నర ఏడాది నుండి చేసేందుకు పనులు లేక అల్లాడుతున్నారు. అపాయకర మనుగడకు సంబంధించిన కథలు కొల్లలుగా వినపడుతున్నాయి. ప్రజలు ఆహార పదార్థాలు తగ్గించుకున్నారు. ధరలు పెరిగినందున పప్పులు, నూనెలు మానేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధికి హామీ ఇవ్వడం లేదు. పోపుల డబ్బాల పొదుపు ఖర్చయి పోయింది. రెండవ దఫా కరోనా గట్టి దెబ్బ కొట్టింది. ఎటు చూసినా ప్రజలలో నిరాశ అలుముకుంది.
నిష్పక్షపాత అమెరికా తాత్విక సంస్థ ప్యూ పరిశోధన కేంద్రం, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం, మన పేదరికాన్ని అంచనా గట్టింది. 2 డాలర్ల (పడిన రూపాయి విలువతో 150 రూపాయలు) దినసరి ఆదాయాన్ని దారిద్య్ర రేఖగా కాకి లెక్క వేసింది. దీని ప్రకారం ఏడాది క్రితం మన దేశంలో 6 కోట్ల పేదలున్నారు. ఇప్పుడు రెట్టింపునకు పైగా 13.4 కోట్లకు పెరిగారు. మన ఆర్థిక వ్యవస్థ గోతిలో పడిరదని దీని అర్థం. 45 ఏళ్ళ తర్వాత దేశం భారీ పేదరికంలో కూరుకుపోయింది. స్వాతంత్య్రం తర్వాత పాతికేళ్లు ఇలాంటి పేదరికం ఉంది. 1951 నుండి 1974 వరకు పేదరికం జనాభాలో 47% నుండి 56 శాతానికి పెరిగింది. ప్రపంచంలో ఇండియాలోనే పేదరికం ఎక్కువగా పెరిగిందని 2020 పరిస్థితి తెలుపుతోంది. 2019లో మన పేదల సంఖ్య 36.40 కోట్లని ఐక్య రాజ్య సమితి లెక్కగట్టింది. ఇది దేశ జానాభాలో 28%. పట్టణ ప్రాంతాల్లో కూడా లక్షల సంఖ్యలో ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు దిగారని ఈ లెక్కలు తెలుపుతున్నాయి. మధ్య తరగతి ప్రజల్లో మూడో వంతు పేదలుగా మారారని ప్యూ కేంద్రం తెలిపింది. మన పేదరికం 15 నుండి 20 శాతం పెరిగింది. అంటే దేశ జనాభాలో సగం మంది పేదలుగా మారినట్లే. ఫిబ్రవరి 2020-ఫిబ్రవరి 2021 మధ్య 70 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఇంటి సగటు ఆదాయం 12 శాతం తగ్గింది. 23 కోట్ల కుటుంబాల సగటు దినసరి సంపాదన రూ.375 లకు లోపే. పేదలు, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు భారీగా తగ్గాయి. గ్రామాల్లో 17 కోట్లు, పట్టణాల్లో 5 కోట్లు మొత్తం 22 కోట్ల మంది పేదలుగా మారారు. గ్రామీణ మండీలలో 71% వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడు ఏప్రిల్‌-జూన్‌ 3 నెలల్లోనే 2.23 కోట్ల మంది ఉపాధులు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోజు కూలీలే. వీళ్ళు ఘోరంగా ఇబ్బందులు పడ్డారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదరికం 51-56 శాతానికి, పట్టణ పేదరికం 39-42 శాతానికి చేరిందని అంచనా. పేదరిక పెరుగుదల ఉన్నత కులాల కంటే అనుసూచిత కులాల (ఎస్‌.సి.), జాతుల (ఎస్‌.టి.) లో ఎక్కువ. వీరిలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు అధికం. 2011 జనాభా లెక్కల ప్రకారం భూ యజమానులు ఎస్‌.సి.లలో 14.8 శాతానికి, ఎస్‌.టి.లలో 34.5 శాతానికి పడిపోయారు. కౌలు రైతులు ఎస్‌.సి.లలో 44.4 శాతానికి, ఎస్‌.టి.లలో 45.9 శాతానికి పెరిగారు. వివిధ ప్రాంతాల ప్రజలు కొత్త పేదలుగా, కడు పేదలుగా మారారు. ఈ ఆర్థిక దుస్థితి కొనసాగుతూనే ఉంది. కరోనాను గాలికి వదిలేసినట్లే ప్రభుత్వం పేదరికాన్ని కూడా పట్టించుకోలేదు.
ఇండియాలో దాదాపు 8 కోట్ల మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 36.1% పట్టణ ప్రజలు మురికి వాడల్లో బతుకుతున్నారు. ఇండియాలో ఆంధ్ర మొదటి స్థానంలో ఉంది. దేశంలో అతి పెద్ద మురికివాడ ధారవి 1.75 కిలో మీటర్ల విస్తీర్ణంలో ముంబయిలో ఉంది. భారత రిజర్వు బ్యాంకు 2013 లెక్కల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో 40% ప్రజలు పేదలు. దేశంలో ఇది మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇండియాలో 2 కోట్ల మంది వీధుల్లో నివసిస్తున్నారు. మరో 2 కోట్ల వీధి బాలురు ఉన్నారు. దిల్లీ, కోల్‌కతా, ముంబయిలలో ఒక్కొక్క నగరంలో లక్షకు పైగా వీధి బాలురున్నారని అంచనా. ఈ 4 కోట్ల వీధి జనాభాకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందవు. నిషేధ చట్టాలున్నా 2019 లెక్కల ప్రకారం దేశంలో ఇంకా 15 లక్షల పాకీ పనివాళ్ళున్నారు. వీరిలో 70% స్త్రీలే. పాకీవాళ్ళ నెల కూలీ ఇంటికి రూ.180-రూ.200 మధ్య ఉంటుంది. ప్రపంచంలో పోషకాహారం దొరకని పిల్లల్లో మూడో వంతు అనగా 10 లక్షల మంది మన దేశంలోనే ఉన్నారు. వీరిలో మూడేళ్ళ లోపు పిల్లలు చనిపోతున్నారు. దేశంలో బరువు తక్కువ పిల్లలు గుజరాత్‌, జార్ఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాలు ఎవరి పాలనలో ఉండేవో, ఇప్పుడు ఎవరి పాలనలో ఉన్నాయో గమనించాలి. దేశంలో 1.6 రేటుతో (వంద మందిలో చావులు) అతి తక్కువ ఆకలి మరణాలు ఉన్న రాష్ట్రం కేరళ. ఆరోగ్య సూచికలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు ముందున్నాయి.
వ్యాస రచయిత ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌
ఫోరం జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img