Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేర చట్టాల్లో మార్పుల ప్రక్రియ ప్రారంభం

న్యూదిల్లీ: నేర చట్టాలలో సమగ్రంగా మార్పులు చేసేందుకు భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లలో సవరణ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. ఇందుకోసం కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, భారత ప్రధాన న్యాయమూర్తి, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, వివిధ రాష్ట్రాల బార్‌ కౌన్సిల్‌, పార్లమెంటు సభ్యుల నుండి కూడా హోంమంత్రిత్వ శాఖ సూచనలు కోరింది. క్రిమినల్‌ చట్టాలలో సమగ్ర మార్పులకు సంబంధించి న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానంలో ఈ సంగతి తెలిపారు. దేశంలో అమలవుతున్న నేర చట్టాలలో సంస్కరణలను సూచించడానికి హోంమంత్రిత్వశాఖ ద్వారా 2020 మార్చి 2న దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీ తన వెబ్‌సైట్‌ ద్వారా సూచనలను ఆహ్వానించింది. దీనికి దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు, పరిశోధన కేంద్రాలు, విద్యావేత్తలు, న్యాయవాదులు, పౌర సమాజాల నుండి ప్రతిస్పందన వచ్చింది. విస్తృత సంప్రదింపులు, పరిశోధనల తర్వాత కమిటీ ఫిబ్రవరి 27, 2022న మూడు క్రిమినల్‌ చట్టాలు -ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌పై తన సిఫార్సులను సమర్పించింది. హోంవ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ, తన 146వ నివేదికలో దేశంలోని నేర, న్యాయ వ్యవస్థపై సమగ్ర సమీక్ష అవసరమని సిఫార్సు చేసినట్లు రిజిజు పేర్కొన్నారు. అంతకుముందు పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ తన 111వ ,128వ నివేదికలలో సంబంధిత చట్టాలలో ముక్కలు ముక్కలుగా సవరణలు తీసుకురాకుండా పార్లమెంట్‌లో సమగ్ర చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోని క్రిమినల్‌ చట్టాన్ని సంస్కరించి, హేతుబద్ధీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img