Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేద‌ల ఆరోగ్యానికి ప్ర‌భుత్వ అండ‌

రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
ఫ్యామిలీ డాక్ట‌ర్ సేవ‌ల‌ను ప్రారంభించిన మంత్రి

విశాలాంధ్ర -విజ‌య‌న‌గ‌రః రాష్ట్రంలో పేద ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఇంటివ‌ద్ద‌కే వైద్య సేవ‌ల‌ను అందించేందుకు ఫ్యామిలీ డాక్ట‌ర్ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. మండ‌లంలోని ద్వార‌పూడి గ్రామంలో ఫ్యామిలీ డాక్ట‌ర్ సేవ‌ల‌ను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గురువారం లాంచ‌నంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా 104 సంచార వైద్య‌శాల‌ను ఆయ‌న ప్రారంభించారు.

                ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో మంత్రి బొత్స మాట్లాడుతూ, ఫ్యామిలీ డాక్ట‌ర్ కార్య‌క్ర‌మం రాష్ట్రంలో ఒక విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మంగా అభివ‌ర్ణించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా, పేద‌ల ఇంటివ‌ద్ద‌కే వైద్య సేవ‌ల‌ను అందించ‌డం ఒక వినూత్న ప్ర‌క్రియ‌గా పేర్కొన్నారు. ప్ర‌జ‌ల బాగోగుల‌ను ప‌ట్టించుకొనే ప్ర‌భుత్వమే ప‌దికాలాలు నిలిచిఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలోని 66 పిహెచ్‌సిల్లోనూ ఇద్ద‌రు వైద్యుల‌ను నియ‌మించామ‌ని, ఒక డాక్ట‌ర్ ఆసుప‌త్రిలో ఉంటే, మ‌రో డాక్ట‌ర్ 104 వాహ‌నంలో గ్రామాల‌కు వెళ్లి వైద్యం అందిస్తార‌ని చెప్పారు. గొప్ప స‌దుద్దేశంతో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని కోరారు. సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుపై ప్ర‌జ‌ల‌ను నేరుగా అడిగి తెలుసుకున్నారు. త‌ల్లితండ్రులు కూడా అప్పుడ‌ప్పుడూ పాఠ‌శాల‌ల‌కు వెళ్లి మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని త‌నిఖీ చేయాల‌ని సూచించారు. రాజ‌కీయాల‌కు అతీతంగా, అర్హులైన వారంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

               డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, ప్ర‌జ‌ల ఆరోగ్య‌మే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానానికి మ‌న ముఖ్య‌మంత్రి శ్రీ‌కారం చుట్టార‌ని అన్నారు. ఇలాంటి గొప్ప‌ విధానం దేశంలో ఎక్క‌డా లేద‌ని చెప్పారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య సేవ‌లు అంద‌డంతోపాటు, ఆరోగ్యంప‌ట్ల అవ‌గాహ‌న పెంపొందించేందుకు దోహ‌ద‌ప‌డతాయ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఇంటింటికీ పింఛ‌న్‌, రేష‌న్ పంపిణీ చేస్తున్నామ‌ని, తాజాగా ఇంటింటికీ వైద్య సేవ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని అన్నారు. అవినీతి, లంచ‌గొండిత‌నం లేని ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి జ‌గ‌న‌న్న‌కు చెబుదాం కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని ల‌బ్దిదారులు నేరుగా ముఖ్య‌మంత్రికే ఫోన్ చేసి చెప్పుకోవ‌చ్చ‌ని సూచించారు.

             క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి మాట్లాడుతూ, ప్ర‌భుత్వం విద్య‌, వైద్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ వైద్యుల‌ సేవ‌ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని, ఆర్ఎంపిల దగ్గ‌ర‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించారు. కొంద‌రు ఆర్ఎంపిల దగ్గ‌ర‌కు వెళ్లి, రోగం ముదిరిపోయాక‌ ప్రాణాల‌మీదకు తెచ్చుకుంటున్నార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం పోష‌కాహారాన్ని పంపిణీ చేస్తోంద‌ని, దానిని వినియోగించుకొని ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరారు. ర‌క్తం పెర‌గాలంటే చింత‌పండు వాడ‌కాన్ని, జంక్ ఫుడ్స్‌ను త‌గ్గించాల‌ని, చిరుధాన్యాల వాడ‌కాన్ని పెంచాల‌ని సూచించారు. ఆడ‌పిల్ల‌ల‌ను కూడా క‌నీసం డిగ్రీవ‌ర‌కు చ‌దివించాల‌ని కోరారు. యుక్త‌వ‌య‌సు యువ‌తీయువ‌కుల‌పై దృష్టిపెట్టి, వారి న‌డ‌వ‌డిక‌ను నిరంత‌రం గ‌మ‌నిస్తూ ఉండాల‌ని సూచించారు.

           ఈ స‌మావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, జెడ్‌పి సిఇఓ ఎం.అశోక్‌కుమార్‌, మండ‌ల ప్ర‌త్యేకాధికారి అరుణ‌కుమారి, ఎంపిపి మామిడి అప్ప‌ల‌నాయుడు, పిఏసిఎస్ అధ్య‌క్షులు కెల్ల త్రినాధ్‌, ఎంపిడిఓ గంటా వెంక‌ట‌రావు, తాశీల్దార్ సిహెచ్ బంగార్రాజు, ఎంఈఓ రాజు, న‌డిపేన శ్రీ‌నివాస‌రావు త‌దిత‌ర ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img