Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ ఏకపాత్రాభినయం

గుజరాత్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అనూహ్యంగా మునుపెన్నడూ లేనన్ని స్థానాలు సంపాదిస్తుందని పోలింగ్‌ ముగిసిన తరవాత పరిస్థితిని అంచనా వేసే వివిధ సంస్థలు చెప్తున్నాయి. ఇవి చాలా సందర్భాలలో జోస్యం స్థాయి దాటవు. ఈ అంచనాలు పూర్తిగా గురి తప్పిన సందర్భాలూ ఉన్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ పరిస్థితి ఉందని, దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పదిహేనేళ్ల తరవాత ఆమ్‌ ఆద్మీ పార్టీ వశం అవుతుందని ఈ అంచనాలు చెప్తున్నాయి. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గుజరాత్‌కు చెందిన వారే అయినందువల్ల వారు సర్వశక్తులూ ఒడ్డి ఎన్నికల ప్రచార రంగంలో నిర్విరామ పోరాటం కొనసాగించారు. కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్‌లో విజయం సాధించడానికి భారీ ప్రయత్నమే చేసింది. అందువల్ల ముక్కోణపు పోటీ అనివార్యం అయింది. 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది కనక ప్రజలలో వ్యతిరేక భావన ఉండడం సహజమే. కానీ గుజరాత్‌ లో బీజేపీ ప్రభుత్వం మీద ఫిర్యాదులు చర్చకు రాకుండా మోదీ ఎన్నికలకు చాలా ముందే గుజరాత్‌ మంత్రివర్గాన్ని టోకున మార్చేసి కొత్త ప్రభుత్వ పాపం ఏమీ లేదు అని నమ్మించడానికి చేసిన ప్రయత్నం సఫలమైనట్టే ఉంది. ప్రజల దైనందిన సమస్యలు ఎన్నికల సమయంలో ప్రధాన చర్చనీయాంశాలు కాకుండా జాగ్రత్త పడడంలో మోదీకి మించిన వారు లేరు. అయినా ఆయన గుజరాత్‌ శాసనసభ ఎన్నికలను తేలికగా తీసుకోలేదు. ఎన్నికలు ప్రకటించడానికి ముందే ఆ రాష్ట్ర ప్రజలకు వేయదలచుకున్న ఎరలన్నీ వేసేశారు. అయితే గుజరాత్‌ నమూనా అన్న మాట ఎక్కడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే గుజరాత్‌ సాధించిన మహాద్భుత అభివృద్ధి ఏ రంగంలోనూ లేదు. అందుకే ఎన్నికల ప్రచార ఘట్టం చివరి పాదంలో అమిత్‌ షా బీజేపీకి బాగా అలవాటైన, కలిసొచ్చిన మతతత్వ రాజకీయాలకు తెర తీశారు. 20 ఏళ్ల కింద గుజరాత్‌ మారణ కాండ జరిగినప్పుడు తాము గట్టిగా బుద్ధి చెప్పినందువల్లే గుజరాత్‌ లో అప్పటి నుంచి మతకలహాలు లేవనీ, కర్ఫ్యూ ఊసే లేదని అన్నారు. బీజేపీ ఎవరికి బుద్ధి చెప్పిందో బహిరంగంగా తెలియజేయక పోయినా ముస్లింలకే బీజేపీ బుద్ధి చెప్పిందని బధిరాంధులకు కూడా అర్థమై పోయింది. తనకు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని మోదీ ఏ మాత్రం మొహమాట పడకుండా తాను బీజేపీని మించిన వాడినని చెప్పకనే చెప్పారు. 2017 నాటి గుజరాత్‌ శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్‌ కు 77 స్థానాలు దక్కాయి. ఈ సారి అన్ని స్థానాలు రాకపోవచ్చనే సర్వేలు చెప్తున్నాయి. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల కార్యక్రమం ప్రకటించిన తరవాత మోదీ దాదాపు ఆ రాష్ట్రంలోనే మకాం వేశారేమో అనిపించింది. ఇది వరకు ఏ ప్రధానమంత్రీ ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఇంతగా ప్రచారం చేసిన ఉదంతాలే లేవు. మోదీ మొత్తం 27 ర్యాలీల్లో పాల్గొన్నారు. 50 కిలో మీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్‌ లో అధికారం నిలబెట్టుకోవడం బీజేపీకన్నా మోదీ ప్రతిష్ఠా భంగాన్ని నివారించడమే ముఖ్యం అని తేలిపోయింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా తీవ్ర ప్రయత్నమే చేశారు. కానీ ఆయన వ్యవహార సరళి తక్షణం గుజరాత్‌ లో అధికారం సంపాదించడం అనిపించలేదు. ఆయన 2027 ఎన్నికల మీద గురి పెట్టినట్టున్నారు. సర్వేల ఫలితాలను చూస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదనిపిస్తోంది. కేజ్రీవాల్‌ హిందుత్వ పరిభాష వినియోగించడంలో బీజేపీకి ఏ మాత్రం తీసిపోవడం లేదు కనక ఆయన బీజేపీ ఓట్లకు గండి కొడతారనుకున్న అంచనాలూ సరైనవి కావనిపిస్తోంది. మొదటి నుంచీ ఆయన కాంగ్రెస్‌ ఓట్లకు గండి కొట్టడం మీదే దృష్టి కేంద్రీకరించారు. మధ్యలో అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్‌ 14స్థానాలలో పోటీ చేసి కాంగ్రెస్‌ కు పడవలసిన ముస్లిం ఓట్లు పడకుండా చేసారు. ఇది పరోక్షంగా బీజేపీకి ప్రయోజనం చేకూర్చే మజ్లిస్‌ మార్కు రాజకీయం. బిహార్‌లో కూడా ఇదే జరిగింది.
ఇదంతా ఒక ఎత్తయితే గుజరాత్‌ శాసన సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలే లేవు. సోనియా, ప్రియాంక అటు వేపు కూడా చూడలేదు. కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే మాత్రం ప్రయత్న లోపం లేకుండా కొన్ని చోట్ల ప్రచార లాంఛనం పూర్తి చేశారు. గత సెప్టెంబర్‌ ఏడున తమిళనాడు లోని కన్యా కుమారి నుంచి భారత్‌ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ దృష్టి అంతా ఆ యాత్ర మీదే ఉంది. ఒకటి రెండు రోజులు మాత్రమే రాహుల్‌ గాంధీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రచారం చాలా మందకొడిగానే సాగింది. అయితే ఆర్భాటం లేకుండా కాంగ్రెస్‌ ప్రచారం సాగుతోందన్న మాట వినిపించింది. కాంగ్రెస్‌ ప్రచారం జోరుగా సాగకపోవడానికి భారత్‌ జోడో యాత్ర ఒక్కటే కారణం కాదు. ఎటూ గెలవని చోట వనరులు ఎందుకు వృథా చేసుకోవడం అన్న విజ్ఞత కాంగ్రెస్‌ నాయకుల మెదళ్లలో మెదిలినట్టుంది. అందుకే హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రచారంపైనే ఎక్కువ ఆసక్తి చూపారు. అక్కడ కాంగ్రెస్‌ కు విజయావకాశాలు లేకపోలేదు.
అసలు రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రస్తావనే లేదు. ఇంతవరకు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో భారత్‌ జోడో యాత్రకు మంచి స్పందనే కనిపించింది. బడా మీడియా సంస్థలు భారత్‌ జోడో యాత్రకు ప్రచారం ఇవ్వకూడదని కంకణం కట్టుకున్నా జనం మాత్రం ఎక్కడికక్కడ ఉత్సాహంగానే పాల్గొంటూనే ఉన్నారు. రాహుల్‌ యాత్ర సాగే మార్గాన్ని ఖరారు చేసినప్పుడు కూడా పూర్తిగా పశ్చిమాన ఉన్న, శాసనసభ ఎన్నికలు జరగవలసిన గుజరాత్‌ గుండా ఈ యాత్ర సాగాలని అనుకున్నట్టు లేదు. అంటే రాహుల్‌ గాంధీ సైతం తక్షణ ప్రయోజనాలకన్నా దీర్ఘకాలిక లక్ష్యాల మీదే దృష్టి పెట్టినట్టు కనిపిస్తున్నారు. ఈ యాత్రకు జనం వేలు లక్షల సంఖ్యలో తరలి రావడం, ఎక్కడికక్కడ సామాజిక కార్యకర్తలు రాహుల్‌ తో కలిపి అడుగులేయడం బీజేపీలో వణుకు పుట్టించింది. అందుకే ఎందుకూ కొరగాని అంశాల మీద రగడ చేయడానికి ప్రయత్నించి బీజేపీ భంగ పడిరది. గుజరాత్‌ నుంచి కేజ్రీవాల్‌ దృష్టిని మళ్లించడానికి దిల్లీ మునిసిపల్‌ కార్పొరరేషన్‌ ఎన్నికలు హడావుడిగా నిర్వహించినా బీజేపీకి ప్రయోజనం దక్కేట్టు లేదు. పదిహేనేళ్ల తరవాత బీజేపీ అక్కడ అధికారం కోల్పోవడం ఖాయం అనిపిస్తోంది. ఈ విజయం కేజ్రీవాల్‌ కు మేలే చేస్తుంది. మొత్తం మీద మోదీ ఏకపాత్రాభినయం కనువిందు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img