Friday, April 19, 2024
Friday, April 19, 2024

సంక్షోభం దిశగా బీహార్‌.. గవర్నర్‌ను కలవనున్న నితీష్‌

బీహార్‌ రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనత దళ్‌ (యునైటెడ్‌)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతోన్నాయి. భాగస్వామ్య పార్టీ బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకుంది. బీజేపీకి గుడ్‌బై చెప్పడం దాదాపుగా ఖాయమైంది. సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో బీజేపీకి బదులుగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్‌ను మద్దతును తీసుకోనుంది. ఆర్జేడీతో కలిసి సంకీర్ణ కూటమి సర్కార్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
గవర్నర్‌తో భేటీ..
ఇందులో భాగంగా జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌.. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలుసుకోనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌కు అధికారికంగా లేఖ రాశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ లభించింది. నితీష్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌ సహా కొందరు కీలక నాయకులు గవర్నర్‌ ఫగు చౌహాన్‌తో భేటీ కానున్నారు. బీజేపీకి బదులుగా తాము ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేయనున్నారు.
జేడీయూకు చెందిన లోక్‌సభ, శాసన, శాసన మండలి సభ్యులు, పార్టీకి చెందిన ఇతర సీనియర్‌ నాయకులు ఈ ఉదయం 11 గంటలకు రాజధాని పాట్నాలో గల నితీష్‌ కుమార్‌ నివాసంలో భేటీ అయ్యారు. ఇదే సమావేశానికి ప్రతిపక్ష ఆర్జేడీ నుంచి నలుగురు సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. బీజేపీతో తీవ్రమైన విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ జేడీయూ నాయకులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై నితీష్‌ కుమార్‌-తేజస్వి యాదవ్‌ ఫోన్‌లో సంభాషించారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ఆర్జేడీ, కాంగ్రెస్‌ హామీ ఇచ్చాయి. బీజేపీయేతర ప్రభుత్వం గనక ఏర్పాటైతే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని బీహార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అజిత్‌ శర్మ తెలిపారు. నితీష్‌ కుమార్‌ ఎన్డీఏ నుంచి బయటికి రావడాన్ని తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఆయనకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
అదే సమయంలో తేజస్వి యాదవ్‌ నివాసంలో కూడా ఆర్జేడీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. నితీష్‌ కుమార్‌ ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మంతనాలు సాగించారు. కాంగ్రెస్‌ కూడా నితీష్‌కు అండగా ఉండటానికి అంగీకరించిన నేపథ్యంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా- నితీష్‌ కుమార్‌ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతోన్న బీజేపీ శాసన సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడానికి అంగీకరించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోమని వారు భీష్మించారు. తమపై వేటు వేసుకోవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img