Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

సాక్షులు 23 మందేనా?

లఖింపూర్‌ ఖేరి ఘటనలో యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీం అసహనం
సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశం
కేసు తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా

న్యూదిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి కేసు దర్యాప్తు విషయంలో ఆ రాష్ట్రంలోని యోగి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు వేసింది. ఈ కేసులో అనుసరిస్తున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా వాహనంతో తొక్కించి నలుగురు రైతుల ప్రాణాలను తీసిన సంగతి తెలిసిందే. ‘ఈ కేసుకు సంబంధించి కేవలం 23 మంది సాక్షులే ఎందుకున్నారు..? ఇంకా ఎక్కువ మందిని గుర్తించి, వారి వాంగ్మూలాలు నమోదు చేయాలి. సాక్షులకు రక్షణ కల్పించాలి. వాంగ్మూలాలు రికార్డు చేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా, తగిన న్యాయ సిబ్బంది అందుబాటులో లేకపోతే.. దగ్గర్లోని జిల్లా న్యాయమూర్తి తగిన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో మొదటి నుంచి యోగి ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్త్తోందని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. చివరి నిమిషంలో నివేదిక సమర్పించడం, 164 మందిలో 44 మంది సాక్షుల్నే విచారించడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీనిపై సుప్రీంకోర్టు ఇంతకుముందు అసంతృప్తి వ్యక్తం చేస్తూ… విచారణను అంతులేని కథగా మార్చకండని యోగి ప్రభుత్వానికి చివాట్లుపెట్టింది. ఈ కేసులోనే శ్యామ్‌ సుందర్‌, పాత్రికేయుడు రమన్‌ కశ్యప్‌ మృతికి సంబంధించి స్థాయీ నివేదికను కూడా తమకు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను నవంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. లఖింపూర్‌ ఖేరిలో అక్టోబరు 3న రైతులపై వాహనాలు ఎక్కించిన ఘోర ఘటనకు సంబంధించిన కేసులో 30 మంది నుంచి 164 స్టేట్‌మెంట్లు రికార్డు చేశామని, వారిలో 23 మంది ప్రత్యక్ష సాక్షులని మంగళవారం కేసు విచారణ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఘటన వీడియోలకు సంబంధించిన నివేదిక ప్రక్రియను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు వేగవంతం చేయాలని ఆదేశించింది. అలాగే సాక్షుల వాంగ్మూలం రికార్డు చేయడాన్ని కూడా వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటన సమయంలో 4 నుంచి 5 వేల మంది స్థానికులు ఉన్నప్పుడు, ఘటన అనంతరం కూడా వీరిలో ఎక్కువ మంది ఆందోళనకు దిగినప్పుడు, వారిని గుర్తుపట్టడం పెద్ద సమస్య కాదని కోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ హరీష్‌ సాల్వే తన వాదన వినిపించారు. మొత్తం 68 మంది సాక్షులలో 30 మంది సాక్షుల స్టేట్‌మెంట్లు ఇంతవరకు రికార్డు చేశామని ఆయన కోర్టుకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img