ఏపీలో అక్రమ నిర్మాణాలపై స్పందించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
ఏపీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి నారాయణ
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్చందంగా ఖాళీ చేయాలని సూచన
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అపార నష్టం జరిగింది. ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతలాకుతలం అయింది. విజయవాడ పట్టణంలోని పలు వార్డుల్లో వేలాది ఇళ్లు, బుడమేరు పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బుడమేరు ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినందున భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఆక్రమణల తొలగింపే పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తోంది. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. హైడ్రా తరహాలో ఏపీలోనూ ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న వాదనలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. మంగళవారం మచిలీపట్నం పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బుడమేరు ఆక్రమణల వల్లే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్చందంగా ఖాళీ చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాల్లో ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలిపారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిడ్కో ఇళ్లు వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల్లో ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి వారిని సంతోషపెట్టిన తర్వాతే ముందుకు వెళతామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు తావు లేకుండా అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు.