విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : హెచ్ఐవి,ఎయిడ్స్ పై యువతలో అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన జిల్లా స్థాయి డ్రామా కాంపిటీషన్ ను సోమవారం ఆర్ట్స్ కళాశాలలో జిల్లా రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శశాంక మౌళి మాట్లాడుతూ… డ్రామా అనేది ప్రభావవంతమైన మాధ్యమం అని, ఏ విషయమైనా సూటిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లవచ్చునని, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తే బాగుంటుందని, ఈ సూచనను ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి వారికి నివేదించాలని కోరారు.
రెడ్ రిబ్బన్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ డా. గిరిధర్ మాట్లాడుతూ… యువత, ముఖ్యంగా విద్యార్థులు సమాజంలో హెచ్.ఐ.వి పట్ల అవగాహన తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని, హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారి పట్ల వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు.
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ డి.పి.యం. వెంకట రత్నం మాట్లాడుతూ… హెచ్.ఐ.వి. కేవలం అసురక్షిత లైంగిక సంపర్కం, హెచ్ఐవి ఉన్న తల్లి నుండి బిడ్డకు, హెచ్.ఐ.వి. కలుషిత సూదులు, సిరంజిలు, రక్త మార్పిడి ద్వారా మాత్రమే ఒకరి నుండి మరొకరికి సోకే అవకాశం ఉందని, దోమల ద్వారా, మరుగు దొడ్ల ద్వారా, కలిసి భోజనం చేయటం ద్వారా, కలిసి జీవించటం ద్వారా రాదని తెలిపారు.
ఈ డ్రామా పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వైస్ ప్రిన్సిపాల్ శశాంక మౌళి, అధ్యాపకులు శైలజ, షమ భారతి వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి విష్ణు ప్రియ మాట్లాడుతూ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.
ఎస్ఎసబిన్ కాలేజీ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రసూల్ మాట్లాడుతూ… విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనపరచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆర్ట్స్ కళాశాల, ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.