గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రజలు వినాయక చతుర్ధికి మట్టి గణపతినే పూజించాలని ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గవి మఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామి, ఉరవకొండ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, పేర్కొన్నారు. శుక్రవారం ఉరవకొండ పట్టణంలో జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై వుందని, ప్రజలు మట్టి గణపతినే పూజించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక ప్రతిమలలో ప్లాస్టో పారిస్, ధర్మోకోల్ వాడటం వలన అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలగడమే కాకుండా మంచినీటి చెరువులు,సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని, వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణ హానికి కారణమవుతున్నాయన్నారు. ప్రకృతిని గౌరవించకపోవడం వలన మనం అనేక విపత్తులు చూస్తున్నామని, కాలుష్యంలో మనం అగ్రస్థానంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా కాలుష్యం పెరగకుండా ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూజించాలని విజ్ఞప్తి చేశారు. మన బావి తరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మట్టి వినాయక ప్రతిమలను అందించి స్పూర్తిని కలిగించారు. పర్యావరణాన్ని కాపాడడానికి జై కిషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మట్టి గణపతి ప్రతిమలను తీసుకెళ్లారు.