Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రక్తదానానికి యువత ముందుకు రావాలి

రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి.జగన్మోహన్ రావు

విశాలాంధ్ర – శ్రీకాకుళం: జిల్లాలో రక్తదానం చేసేందుకు యువత ముందుకురావాలని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహన్ రావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం పురష్కరించుకొని దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తం సేకరించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలో నేటి నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతి రోజూ రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేసి రక్త నిల్వలను సేకరించనున్నట్లు చెప్పారు. జిల్లా రెడ్ క్రాస్ రక్తనిధి కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జంపు కృష్ణమోహన్ తో కలిసి రక్తదాన శిబిరానికి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ కోవిడ్ అనంతరం జిల్లాలో తగినంత రక్తనిల్వలు లేవని, ఇందుకు రక్తదానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేయగలిగితే రక్తం యూనిట్ల కొరత ఉండబోదని తెలిపారు. వివిధ కళాశాలల విద్యార్ధులు ఇప్పటికే రక్తదానం చేసేందుకు ముందుకువస్తున్నారని, వారి స్పూర్తితో మిగిలిన విద్యార్థులు కూడా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, రక్తదానం వలన ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల విద్యార్ధులు పాల్గొనడం ఆనందంగా ఉందని, సుమారు 70 మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జె.కృష్ణమోహన్, డిపిఎం ఉమామహేశ్వరరావు, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.వి.ప్రసాదరావు, పెంకి చైతన్య కుమార్, నెహ్రు యువక కేంద్ర పరిపాలనా అధికారి జి.శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ సిబ్బంది, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img