భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ …
విశాలాంధ్ర – చోడవరం : తే .31.10.2023ది. అనకాపల్లి జిల్లా చోడవరం మేజర్ పంచాయతీ లో జరిగిన అవినీతి కుంభకోణం పై విచారణ చేసి, దోషులను శిక్షించి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. మేజర్ పంచాయతీలో జరిగిన అక్రమాలపై మంగళవారం మండల పరిషత్తు కార్యాలయం వద్ద కమ్యూనిస్ట్ అనుబంధ ప్రజా సంఘాలు వారు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సి.పి.ఐ సమితి సభ్యుడు రెడ్డిపల్లి మీడియాతో మాట్లాడుతూ చోడవరం మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు, కుళాయి పన్నుల్లో సుమారు రూ.20 లక్షలు పైగా పంచాయతీ కార్యదర్శి బిల్లు కలెక్టర్లు వారి సుప్రయోజనాలకు వాడుకుని పంచాయతి ఆదాయానికి గండి కొట్టారన్నారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తెలియపరచినను, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీనివల్ల పంచాయతి అభివృద్ధి కుంటిపడిందని తెలిపారు. చోడవరం లో ఇంటి ప్లాన్లు, ఇంటి పన్నులు పేర్లులో మార్పులు చేర్పులకు భారీగా డబ్బులు తీసుకుని, జీ ప్లస్ 4 నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిపై చర్యలు చేపట్టాలని, కమ్యూనిస్టు పార్టీ ఫిర్యాదు చేస్తే, అధికారులు లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే సుప్రయోజనాలకు పంచాయతీ సొమ్ము వాడుకున్న పంచాయతి కార్యదర్శి, బిల్లు కలెక్టర్లని సస్పెండ్ చెయ్యాలని, దోషులను శిక్షించి వారి నుండి ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ చోడవరం సి.పి.ఐ. కార్యదర్శి నేమాల హరి ఆధ్వర్యంలో ఎం.పి.డి.ఒ. శ్యాం సుందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు పాతరపల్లి కొండబాబు, బొబ్బిలి శంకర్రావు, విస్సారపు నాగూర్, శ్రీను, నాయుడు, శంకర్, నారాయణమూర్తి, మరియు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.