Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

చిరుధాన్యాల వినియోగం పెరగాలి

ఘనంగ జరిగిన మిల్లెట్ మహోత్సవ్
చిరుధాన్యాల వల్లనే ఆహార భద్రత
జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్

విశాలాంధ్ర,పార్వతీపురం : చిరుధాన్యాల వినియోగం పెరిగేలా దీన్నిఉద్యమంగా కొనసాగించి అందరిదృష్టి చిరుదాన్యాల వినియోగంలో ఉండేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జిల్లాలోని డి ఆర్ డి ఏ, వ్యవసాయ శాఖ, ఏపీ సిఎన్ఎఫ్, ఐసిడిఎస్, స్వచ్ఛంద సంస్థలు ఆద్వర్యంలో ఐటీడిఏ లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవాన్ని (మిల్లెట్ మహోత్సవాన్ని) జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.అనంతరం ఐటీడిఏ ఆద్వర్యంలో ఆయా శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చిరుదాన్యాల స్తాల్లును పరిశీలించారు.చిరు ధాన్యాల ప్రాధాన్యత, తయారు చేసే విధానం గూర్చి వారంతా జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఐటీడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీఒక్కరూ చిరు దాన్యాలతో తినాలని, భవిష్యతరాలు శతశాతం చిరుధాన్యాలు తినేవిధంగా బాటలు వేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవన విధానంలో మార్పు రావాలన్నారు. ఐక్య రాజ్య సమితిలో భారతదేశం చిరుధాన్యాల ప్రస్తావన తీసుకువచ్చి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం జరుపుకునే విధంగా చేశారని చెప్పారు.1965 సంవత్సరంలో చిరు ధాన్యాల పంటలు 20శాతంగా ఉండగా, ప్రస్తుతం 6శాతంగా ఉందని తెలిపారు. తక్కువఆదాయ వర్గాలు మాత్రమే తింటారనే ప్రజల్లో మానసికమైన ఆలోచనా విధానం కూడా చిరు ధాన్యాలు తగ్గుదలకు కారణమని చెప్పారు. హరిత విప్లవంలో వరి, గోధుమల పంటలు ఎక్కువగా పండించడం ప్రారంభించడం, చిరు ధాన్యాలు తగ్గించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తున్నాయని, హైపర్ టెన్షన్, మధుమేహం వంటి కేసులు ఫ్యామిలీ డాక్టరు విధానం పరీక్షలలో కనిపిస్తుందని చెప్పారు. శారీరక వ్యాయామం తగ్గుదల కూడా ఇందుకు ఒక కారణమన్నారు. చిరుధాన్యాలు వలన ఆహార భద్రత వస్తుందని చెప్పారు.
చిరుధాన్యాల పంటలకు తక్కువనీరు సరిపోతుందని, చిన్నసన్నకారు రైతులు ఇబ్బందులు లేకుండా పండించవచ్చని సూచించారు. ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగల మంచి పంట అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి పెంచాలని, వ్యవసాయశాఖ సరైన మార్గదర్శత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. చిరు ధాన్యాలకు డిమాండ్ ఉండాలని, చిన్న పట్టణాల్లో కూడా డిమాండ్ రావాలని అందుకు ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ విధానంలో మార్పు వస్తుందని, మద్దతు ధర ప్రకటించడం జరిగిందని చెప్పారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యానికి చిరు ధాన్యాలు చాలా అవసరమన్నారు. ఆరోగ్యం బాగుంటే ఆర్థికంగా బాగుంటుందని ఆయన చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ మాట్లాడుతూ జిల్లాలోవ్యవసాయ రంగంలో అనేక కార్యక్రమాలు చేపట్టడంతో ధాన్యం బాగా దిగుబడి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఐదుసంవత్సరాల కాలంలో చిరు ధాన్యాల పంటను పెంపుదల చేయుటకు ప్రభుత్వం నిర్ణయంచిందని అన్నారు. కనీస మద్దతు ధరను కూడా ప్రకటించారని ఆయన చెప్పారు. దిగుబడి జరిగిన పంట మొత్తం కొనుగోలు చేయుటకు ముఖ్య మంత్రి ప్రకటించార న్నారు. చిరుధాన్యాలతో అంగన్వాడీ కేంద్రాలలో, మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాల తయారీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. జిల్లాలో 4 వేలఎకరాల్లో చిరుధాన్యాల పంటలు వేస్తున్నారని, ప్రస్తుతం
4 వందల ఎకరాల్లో పంటఉందని అన్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని ఆయన చెప్పారు. జిల్లాలో ఎకరాకు 2 నుండి 3 బస్తాలు దిగుబడి వస్తుందని, విత్తనాల రకాలు మార్చుకొని దిగుబడి పెంచాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎక్కువ చిరు ధాన్యాల పంట విస్తీర్ణం పెంచుటకు కార్యాచరణ ప్రణాళిక ఉందని, ముఖ్యంగా రాగి విత్తనాలను రాయితీపై అందించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మహిళా శిశుసంక్షేమ అధికారి కె. విజయగౌరి మాట్లాడుతూ ఆహారం మార్పుచెందడంతో అనేక రకాల వ్యాధులకు గురవుతున్నామని అన్నారు. చిరుధాన్యాలు తీసుకుంటే అన్ని విటమిన్లు లభిస్తాయని, శారీరక దారుఢ్యం కలిగి ఉంటారని ఆమె తెలిపారు. గర్భిణీలు తీసుకోవడం వలన మంచి పోషకాహారం అంది ఆరోగ్యకర పిల్లలు పుడతారని, ఆరోగ్యకర సమాజం నెలకొంటుందని ఆమె వివరించారు.
ఆహార భద్రత అధికారి మాట్లాడుతూ కొర్రలు, సామలు, అండు కొర్రలు, ఊదలు, అరికెలు మంచి పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలన్నారు. కొత్తవలస కె.పి.ఎం పాఠశాల 9వతరగతి విద్యార్థిని బి.బాందవి ఆంగ్లంలో ప్రసంగించి చిరు ధాన్యాలకు అంతర్జాతీయ స్తాయిలో వచ్చిన గుర్తింపును తెలిపారు. ప్రధాన మంత్రి చిరుధాన్యాలను ప్రజా ఉద్యమంగా చేసి అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంను జరుపుకునే విధంగా చేశారన్నారు.ఈసందర్భంగా చిరు ధాన్యాలను సాగు చేస్తున్న రైతులను, వివిధ పోటీలో విజేతలను జ్ఞాపికలతో, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
ఈకార్యక్రమంలో టి.పి.ఎం.యు ఏపిడి
వై. సత్యంనాయుడు, రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తేజేశ్వర రావు, ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నూక సన్యాసిరావు, జట్టు సంస్థ సభ్యులు, వెలుగు సిబ్బంది,మహిళ రైతులు, ఏపీసిఎన్ఎఫ్ సిబ్బంది, రైతులు, మహిళ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img